ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంశీ వ్యాఖ్యలపై మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 07:45 PM

వల్లభనేని వంశీ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధిష్టానం వైఖరిపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. లైవ్‌లో వంశీ తనను అన్ని తిట్లు తిట్టినా పార్టీలో తనకెవ్వరూ మద్ధతు పలకపోవడంపై రాజేంద్రప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వంశీ తనను ఒంటికన్నువాడని తిడితే ఒక్కరూ మాట్లాడలేదని రాజేంద్రప్రసాద్ మనస్తాపం చెందారు. వల్లభనేనిపై నేరుగా కేసు పెట్టడానికి అధిష్టానం నిరాకరించిందని, పార్టీ న్యాయం చేస్తేనే వంశీకి వ్యతిరేకంగా పోరాడుతానని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మద్ధతు పలకకపోవడంపై యలమంచిలి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద వల్లభనేని వంశీ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
మరోవైపు వల్లభనేని వంశీ తన రాజకీయ భవిష్యత్తును అగమ్యగోచరం చేసుకుంటున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఈ క్రమంలో వివిధ సందర్భాల్లో వైఎస్ జగన్‌పై వల్లభనేని వంశీ చేసిన చేసిన వ్యాఖ్యల దృశ్యాలను మీడియాకు తెలిపారు. అన్నం తినేవాడేవ్వడూ వైసీపీలో చేరడు అని చెప్పిన వంశీ.. చివరికి అదే పార్టీలోకి వెళ్తున్నారని వర్ల ధ్వజమెత్తారు. అవినీతిపరుడు, అవగాహన లేదు, వార్డు మెంబర్‌గా కూడా పనికి రాడని జగన్‌ను వంశీ తిట్టారని రామయ్య గుర్తుచేశారు.
వంశీ వ్యవహారశైలి సరిగా లేదని.. పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పట్ల మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. అయ్యప్పమాల వేసుకున్న వంశీ.. తోటి వ్యక్తిపట్ల అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని వర్లరామయ్య ఆరోపించారు. ప్రలోభాలకు లోంగిపోయో, కేసులకు భయపడో వల్లభనేని వైసీపీలోకి వెళుతున్నారని వర్ల విమర్శించారు. ఆనాడు ఎవరు రికమెండ్ చేస్తే వంశీకి టికెట్ ఇచ్చారో రాష్ట్రం మొత్తానికి తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున వంశీ ఎంతో లబ్ధి పొందారని... ఆయనపై ఉన్న ఓ కేసు పనికిమాలినదన్నారు. 
కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. అధినేత ఆదేశాల మేరకు వంశీని శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. దాసరి బాలవర్థన్ గారిని కాదని వల్లభనేని వంశీకి పార్టీ టికెట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నది అవాస్తవమన్నారు. కృష్ణాజిల్లాలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులను టీడీపీ హయాంలో వంశీ పొందారని అర్జునుడు గుర్తుచేశారు. కృష్ణాజిల్లా పార్టీ తనకు సహకరించలేదన్న వంశీ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com