ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచిన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలివే!

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 02:05 PM

క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి శుక్రవారానికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1989 నవంబర్‌ 15న కరాచి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఓ బాలుడిగా అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలనందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకదాని తరువాత మరొకటి రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఎన్నో మైలురాళ్లను నెలకొల్పాడు. క్రికెట్‌లో ఎవరూ సాధించలేనటువంటి రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా సచిన్ టెండూల్కర్ అంతటి పాపులారిటీని దక్కించుకోలేకపోయారు. 2013 అక్టోబర్‌ 10న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానులు #30YearsOfSachinism అంటూ శుక్రవారం ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే లెజెండ్ ప్రదర్శన చేశాడు. తన తొలి పర్యటనలో వసీం అక్రమ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, వకార్‌ యూనిస్‌ లాంటి దిగ్గజాలను ఎదుర్కొని 35.83 యావరేజితో 215 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో యూనిస్ బౌలింగ్‌లో గాయపడి రక్తం కారినా, అలాగే బ్యాటింగ్‌ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ పర్యటనలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత సచిన్ తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. తన చిరకాల స్వప్నం వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడాలన్న కలను ధోని నాయకత్వంలోని టీమిండియా 2011 వరల్డ్‌కప్‌లో నెరవేర్చింది. భారత్ తరుపున సచిన్ ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. 200 టెస్టులాడి 53.78 యావరేజితో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల విషయానికి వస్తే 463 వన్డేలాడి 44.83 యావరేజితో 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా పార్ట్‌టైమ్‌ బౌలర్‌ అన్న సంగతి తెలిసిందే. బౌలర్‌గా టెస్టుల్లో 46 వికెట్లు, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరుపున ఏకైక టీ20 మ్యాచ్ కూడా ఆడాడు. 2011లో వరల్డ్‌కప్‌ను ముద్దాడిన తర్వాత 2012 డిసెంబర్‌ 23న వన్డే క్రికెట్‌కు దూరమయ్యాడు. తర్వాతి ఏడాదే 2013 అక్టోబర్‌ 10న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సచిన్ టెండూల్కర్ అంటే ఓ బ్రాండ్. మాజీ క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌ల తర్వాత వారిని మించి క్రికెటర్లలో అత్యధిక మార్కెట్ స్థాయిని సొంతం చేసుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది సచినే. తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు సచిన్ 17 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్వవహారించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా సచిన్ పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతునే ఉన్నాడు. ఈ క్రమంలో ఫోర్బ్స్ ప్రకటించే ధవంతుల జాబితాలో సచిన్ టెండూల్కర్ ఒకడు. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సి వంటి ఫుట్‌బాల్ క్లబ్‌లతో వ్యాపార ప్రయోజనాలను సచిన్ కలిగి ఉన్నాడు. 


* ప్రసిద్ధ హిందీ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ పేరు మీద అతని తండ్రి సచిన్ టెండూల్కర్ అని పేరు పెట్టడం జరిగింది. ముంబై జట్టులోని సహచర ఆటగాడు ప్రవీణ్ అమ్రే తనకు ఒక జత అంతర్జాతీయ క్రికెట్ షూలను కొన్నాడు.


సచిన్ గురించి తెలియని విషయాలు


* సచిన్ టెండూల్కర్‌కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ అతడికి ప్రత్యేకంగా రూపొందించిన అల్ట్రా-లైట్ ప్యాడ్లను బహుమతిగా ఇచ్చాడు.


* సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి కారు మారుతి 800.


* 19 ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్ ఇంగ్లీషు కౌంటీ క్రికెట్ ఆడాడు. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ సచినే.


* సచిన్ టెండూల్కర్ కుడి చేతితో బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసినప్పటికీ... ఎడమచేతిని తినడానికి వ్రాసేందుకు ఉపయోగిస్తాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com