ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాట్ కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 02:30 PM

మూడు టీ20ల సిరిస్ ముగిసింది. టీ20 సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. దీంతో ఇరు జట్లు ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై దృష్టి సారించాయి. మూడు టీ20ల సిరిస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరిస్ కోసం టీమిండియాతో కలిశాడు. నవంబర్ 14 నుండి బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం కొన్ని మైలురాళ్లు ఎదురు చూస్తున్నాయి. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే, ఇటీవలే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడంతో పాటు సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా సఫారీలను టెస్టుల్లో తొలిసారి క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ మాజీ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాఫెల్ రికార్డులపై కన్నేశాడు. ఈ క్రమంలో భారత తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ రికార్డుని కోహ్లీ అధిగమించనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(82 టెస్టుల్లో 7066) పరుగులతో ఈ జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌరవ్ గంగూలీ భారత్ తరుపున మొత్తం 113 టెస్టులాడి 7212 పరుగులతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌరవ్ గంగూలీ రికార్డుని అధిగమించడానికి విరాట్ కోహ్లీ కేవలం 157 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (15921) అగ్రస్థానంలో ఉండగా రాహుల్ ద్రవిడ్ (13288), సునీల్ గవాస్కర్ (10122), వీవీఎస్ లక్ష్మణ్ (8718), వీరేంద్ర సెహ్వాగ్ (8586) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే క్రిస్ గేల్(7214), స్టీఫెన్ ప్లెమింగ్(7172), గ్రెగ్ ఛాపెల్(7110)ల పరుగుల రికార్డుని కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే నవంబర్ 14 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న హోల్కర్ స్టేడియంలో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. తొలి టెస్టులో పరుగుల వరద పారాలనే ఉద్దేశ్యంతో మంచి స్పోర్టింగ్‌ వికెట్‌ను సిద్ధం చేసినట్టు క్యూరేటర్‌ సమందర్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పాడు. దీంతో పాటు కెప్టెన్‌గా అత్యధిక విజయాలను సాధించిన అలెన్ బోర్డర్ రికార్డుని కూడా కోహ్లీ సమం చేసే అవకాశం కూడా ఉంది. కోహ్లీ ప్రస్తుతం 51 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించగా, బోర్డర్ 91 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com