ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ దళమే కోహ్లీ బలం...

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 02:11 PM

‘‘జోహన్నెస్‌బర్గ్, ముంబై, ఆక్లాండ్, మెల్‌బోర్న్‌... ఇలా వేదిక ఏదైనా సరే మేం పిచ్‌లను పట్టించుకోం. టెస్టు గెలవాలంటే మా లక్ష్యం 20 వికెట్లు తీయడమే! పరిపూర్ణ బౌలింగ్‌ దళంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. పేసర్లు, స్పిన్నర్లు అందరు సమష్టిగా రాణిస్తే 20 వికెట్లు కష్టమేమీ కాదు’’ అని భారత చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ గెలిచాక అన్న మాటలివి. ఇంటా బయటా మన టెస్టు విజయాల్ని లోతుగా పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. మన బౌలింగ్‌ సత్తాతోనే మనమెన్నో మ్యాచ్‌ల్ని, వరుసగా సిరీస్‌లనీ గెలిచాం. గత కొన్నేళ్లుగా అంతలా భారత బౌలింగ్‌ అటాక్‌ రాటుదేలింది. మేటి బ్యాట్స్‌మెన్‌ను సైతం తలవంచేలా చేస్తోంది. ఎవరైనా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ పేస్‌ను ఎదిరిస్తే... వెంటనే స్పిన్‌ తిరుగుతుంది. అతని వికెట్‌ను బలితీసుకుంటుంది. ఇలా పేసర్లు, స్పిన్నర్లు కలసికట్టుగా ప్రత్యర్థి జట్ల ఆట కట్టిస్తున్నారు.  నిజానికి కోహ్లిని విజయసారథిగా మలిచిందే బౌలర్లంటే అతిశయోక్తి లేదు. పిచ్‌ ఎలా ఉన్నా... ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... గత కొన్నేళ్లుగా భారత బౌలర్ల ప్రదర్శన అసాధారణంగా ఉంది. ఈ అసాధారణ ప్రదర్శన ప్రతీ సిరీస్‌లోనూ నిలకడగా కొనసాగడం వల్లే మూడు టెస్టుల సిరీస్‌ల్లో భారత్‌ గెలుపోటముల నిష్పత్తి 3:1గా ఉంది. అంటే సగటున మూడు గెలిస్తే ఒకటి అరా ఓడుతున్నామన్న మాట. ఇక కోహ్లిసేన విజయాల శాతమెంతో తెలుసా 61 శాతం. మొత్తం 27 మంది భారత కెప్టెన్లలో మూడో అత్యుత్తమ సారథిగా కోహ్లిని నిలబెట్టిన ఘనత కచ్చితంగా బౌలర్లదే. తుది జట్టులో బౌలర్ల ఎంపిక, ఆటలో అటాకింగ్‌కు కోహ్లి చేసే కసరత్తు, పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లను ప్రయోగించే నైపుణ్యం అతన్ని మేటి కెప్టెన్‌గా ఎదిగేలా చేశాయి. 2014–15 సీజన్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌తో సందర్భంగా నాయకుడయ్యాక ఇప్పటి వరకు 14 సిరీస్‌లకు నేతృత్వం వహించాడు. 51 టెస్టుల్లో తన కెప్టెన్సీలో... తన సూచనలతో బౌలర్లు సగటున 26.11 పరుగులకు వికెట్‌ చొప్పున  తీశారు. అదే సొంతగడ్డపై 24.56 సగటుతో వికెట్లను పడేసిన బౌలర్లు... ఆశ్చర్యకరంగా దక్షిణాఫ్రికాలో 23.49, ఆస్ట్రేలియాలో 25.00, ఇంగ్లండ్‌లో 29.81 సగటుతో వికెట్లను తీయడం విశేషం. కోహ్లి కేవలం భారత సారథుల్లోనే మేటి కాదు... పలువురు విదేశీ సారథులకు దీటుగా జట్టును నడిపిస్తున్నాడు. కనీసం 40 టెస్టులకు సారథ్యం వహించిన కెప్టెన్ల రికార్డును పరిశీలిస్తే ముగ్గురు మాత్రమే కోహ్లికి దగ్గరగా ఉన్నారు. 1950, 1960 దశకాల్లో ఇంగ్లండ్‌ సారథి పీటర్‌ మే (21.94 సగటు... విజయాల శాతం 48.80) మెరుగైన బౌలింగ్‌ దళాన్ని కలిగి ఉన్నప్పటికీ అప్పటి క్రికెట్‌ లో పరుగుల రేటు మందకొడిగా ఉండేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. మిగిలిన ఇద్దరిలో క్రానే (దక్షిణాఫ్రికా; 25.84 సగటు; విజయాల శాతం 50.90), రిచర్డ్స్‌ (వెస్టిండీస్‌; 25.97 సగటు; విజ యాల శాతం 54.00) జట్ల బౌలింగ్‌ అటాక్‌ బాగుండేది. అయితే వీరి బౌలింగ్‌ దళం పేసర్లతో ఉండేది. ప్రస్తుత టి20ల యుగంలో కోహ్లిసేనకు ఇలాంటి బౌలింగ్‌ సగటు ఉండటం అద్భుతమే అనుకోవాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com