ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య ట్రస్టు’... నేతలు లేకుండా జాగ్రత్తలు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 08:22 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పుతో వీలు కల్పించింది. ఇందులో కీలకమైన ప్రక్రియ ట్రస్టు ఏర్పాటు. కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్టుకు అయోధ్య వివాదాస్పద స్థలిని అప్పగించాల్సి ఉంటుందని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ధర్మకర్త మండలిని రాజకీయాలకు అతీతంగా ఉంచాలని, సభ్యులుగా రాజకీయ నాయకులను తీసుకోరాదని కేంద్రం భావిస్తున్నట్లు ప్రాధమిక సంకేతాలు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం పార్లమెంట్ ద్వారా ఏదేనీ చట్టం తీసుకురావాల్సి ఉంటుందా? అనే విషయంపై ఇప్పటికే కేంద్రం న్యాయ నిపుణులను సంప్రదించింది.ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్యపై ఇటీవలనే చారిత్రక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. మూడు నెలల వ్యవధిలో ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని, ట్రస్టు ద్వారా రామాలయ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించింది. భూ స్వాధీన చట్టంలోని నిర్థిష్ట నిబంధనల పరిధిలో తమకు దక్కిన అధికారాలను వినియోగించుకుని కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. ఇప్పటికే కోట్లాది మంది భక్తుల విశ్వాసాల ప్రాతిపదికన అయోధ్యలో రామమందిర నిర్మాణం అద్భుతంగా నిర్మించేందుకు సంకల్పించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కార్యాచరణకు దిగింది. రామాలయ నిర్మాణంలో ట్రస్టు ఏర్పాటే కీలక ఘట్టం అవుతుంది. వివాదాస్పద స్థలం లోని అంతర్గత, బాహ్య ఆవరణలను అంటే రామ్ చబూత్రా, సీతారసోయ్ ఇతర తాత్కాలిక కట్టడాలు ఉన్న ప్రాంతాలను ట్రస్టుకు అప్పగిస్తారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకులను ట్రస్టులోకి తీసుకోరాదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ట్రస్టులో అందరికీ సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వ్యాజ్యంలో కీలక పక్షమైన నిర్మోహీ అఖారా నుంచి కూడా ట్రస్టులో చోటు కల్పించాలని సూచించింది. నిష్కంళుకులైన ప్రతికూలత లేని మగవారికి, ఆడవారికి వారి ప్రాతిపదికలను బట్టి ట్రస్టులో ప్రాతినిధ్యం కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. ట్రస్టు ఏర్పాటుపై చర్చలు ఇప్పుడు కేవలం ప్రాధమిక స్థాయిలోనే ఉన్నాయి. బడా నేతలెవ్వరికీ ట్రస్టులో స్థానం కల్పించరాదనే అంశంపై ఇప్పటికే తుది నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.రాజకీయ పార్టీలతో సంబంధాలు లేని వారికి, నిష్పక్షపాతంగా ఉండేవారికి స్థానం కల్పించాలని సంకల్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రామాలయ నిర్మాణంలో ట్రస్టు గురుతర బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. తరువాత కూడా భక్తుల సందర్శనానికి వీలు కల్పించిన దశలో ఆలయ నిర్వహణ బాధ్యతలు కూడా ట్రస్టుపై ఉంటాయి. దీనితో ట్రస్టు పాత్ర నిరంతరంగా సాగుతుంది. ఈ కోణంలో సరైన వారికే ట్రస్టులో స్థానం కల్పించడం జరుగుతుంది. అయోధ్య ట్రస్టు ఏర్పాటు ప్రక్రియకు శ్రీ మాతా వైష్ణో దేవీ ధర్మకర్తల మండలిని మార్గదర్శకంగా తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని కత్రాలో ఉన్న ఈ క్షేత్రం నిర్వహణ బాధ్యతలను ట్రస్టే 1986 నుంచి పర్యవేక్షిస్తోంది.నేతలకు ఈ ట్రస్టు దూరంగానే ఉంటుంది కానీ మత ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులకు ట్రస్టులో స్థానం ఉండనే ఉంటుందని వెల్లడైంది. ఇప్పటికే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సారథి శ్రీ శ్రీ రవిశంకర్ వైష్ణో దేవీ ట్రస్టుకు నియమిత సభ్యులుగా ఉన్నారు. ఇతరులు ఎవరికీ కూడా పార్టీలతో సంబంధాలు లేవు. ఈ తరహాలోనే అయోధ్య ట్రస్టు ఏర్పాటు అవుతుందని భావిస్తున్నారు.రామాలయాన్ని ఎటువంటి చిక్కులు లేకుండా నిర్మించాలని హోం మంత్రిత్వశాఖ తలపెట్టింది. చట్టపరమైన న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు ఇటీవలనే కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వారితో సంప్రదింపులు జరిపింది.సంబంధిత 1993 అయోధ్య భూమి చట్టంలో సవరణలు చేపడితే సరిపోతుందా? లేక సరికొత్తగా పార్లమెంట్ ఆమోదంతో మరో చట్టం తీసుకురావాల్సి ఉంటుందా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ట్రస్టు ఏర్పాటు, ట్రస్టుకు అధికారాల కల్పనలో చట్టబద్ధత తీసుకురావాల్సి ఉంటుందా? అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. రామాలయాన్ని సాధ్యమైనంత తొందరగా నిర్మించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకోవల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు. అయితే ట్రస్టు ఏర్పాటుకు 1993 చట్టంలోని నిబంధనలే సరిపోతాయని, కొత్త చట్టం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com