క్రికెట్ కామెంట్రీలో అప్పుడప్పుడు కామెంటేటర్లు బుల్లెట్ కంటే బంతి వేగంగా దూసుకెళ్లిందని చెబుతుంటారు. ఈ వీడియో చూస్తే ఈ మాట నిజమేనని అనుకుంటారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన మూడో టీ20లో ఓ అద్భుతమైన డెలివరీతో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ పాక్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్‌ను డకౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్ ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఓపెనర్ బాబర్ ఆజాం(6)ను ఎల్బీగా స్టార్క్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ రిజ్వాన్‌ను తాను ఎదుర్కొన్న తొలి బంతికే మిచెల్ స్టార్క్ పెవిలియన్‌కు చేర్చడం విశేషం. అయితే, ఓ అద్భుతమైన ఇన్ స్వింగర్‌కు రిజ్వాన్‌ను స్టార్క్ డకౌట్‌గా ఔట్ చేశాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ కష్టాల్లో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిచెల్ స్టార్క్ మిరాకల్ డెలివరీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ నెటిజన్ మిచెల్ స్టార్క్‌ను "కింగ్స్ ఆఫ్ యార్కర్స్" అంటూ కొనియాడాడు. స్టార్క్ చేతి నుంచి వెలువడిన ఓ అద్భుతమైన బంతి అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఇఫ్తికార్ అహ్మాద్(45) టాస్ స్కోరర్‌కాగా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ మూడు వికెట్లు తీయగా... స్టార్క్, అబ్బాట్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆష్టన్ అగర్ ఒక వికెట్ తీశాడు.