అభిజిత్ కు మోడీ క్లాస్

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 07:07 PM
 

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ ప్రధాని మోడీతో ఈ ఉదయం భేటీ అయ్యారు. ఈ బేటీలో వారి మధ్య చర్చకు వచ్చిన విషయాలేమిటి? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం సహజం. ఎందుకంటే…బీజేపీ నేతలంతా అభిజిత్ విధానాలను, సిద్ధాంతాలనూ గత కొన్ని రోజులుగా అంటే అభిజిత్ కు నోబెల్ బహుమతి ప్రకటించిన నాటి నుంచీ విమర్శిస్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టే భారత ఆర్థిక పరిస్థితిపై  చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి ఏమంత సంతోషాన్ని కలిగించేవిగా లేవు. ఈ నేపథ్యంలోనే అభిజిత్, మోడీల భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిజిత్ తో భేటీ అద్భుతం అంటూ మోడీ ట్వీట్ చేశారు. అయినా వారిరువురి మధ్యా చర్చల సారాంశం ఏమిటి? ఏం అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అన్న దానిపై ఆసక్తి ఉండటం సహజం. ఆ విషయాలన్నీ అభిజిత్ నోటి ద్వారా తెలుసుకోవడానికి మీడియా బాగా ఉబలాట పడింది. అందుకే మోడీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిథులు అభిజిత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. భేటీ ఎలా సాగింది, మీ మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి వంటి ప్రశ్నలను సంధించారు. వాటన్నిటికీ అభిజిత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మీరు కోరుకుంటున్నట్లుగా తన నుంచి వివాదాస్పర వ్యాఖ్యలేమీ రావని చెబుతూ…మోడీ తనకు క్లాస్ పీకారని చెప్పారు. ఔను నిజమే…మోడీ అభిజిత్ కు క్లాస్ పీకారు. అయితే ఆ క్లాస్ భారత ఆర్థిక పరిస్థితిపైనా, కేంద్రం ఆర్థిక విధానాలపైనా అభిజిత్ చేసిన వ్యాఖ్యలకు కాదు. సామాజిక మాధ్యమం ట్రాప్ లో పడకుండా ఎలా ఉండాలన్నదానిపై అభిజిత్ కు మోడీ క్లాస్ తీసుకున్నారు. అంతేనా…భారత దేశం గురించి తన ఆలోచన ఏమిటి? ఆలోచించే విధానం ఏమిటి అన్నదానిపై మోడీ అభిజిత్ కు వివరించారు. అంతే కాదు భారత్ విషయంలో తన ఆలోచనా విధానమేమిటన్నది చెప్పడానికి కూడా చాలా సమయం ఇచ్చారని అభిజిత్ మీడియాకు వివరించారు. ఆయన విధానాల గురించే కాకుండా ఆ విధానాల వెనుక ఉన్న ఆలోచన గురించి వినడానికి మోడీ చూపిన ఉత్సుకత చాలా గోప్పగా ఉందని అబిజిత్ పేర్కొన్నారు.