'బోలో తారా రారా' పాట పాడుతూ.. ఉత్సాహంగా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న పోలీసు

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 02:14 PM
 

బిజీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ ను నియంత్రించే పని చాలా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. కొందరు ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ బాధ్యతలను ఒత్తిడికి గురి కాకుండా చాలా ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. ట్రాఫిక్ జామ్ కాకుండా కొందరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాగే, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటువంటి వ్యక్తే చండీగఢ్ కు చెందిన ట్రాఫిక్ పోలీస్ భూపిందర్ సింగ్.


దలేర్ మెహంది పాట 'బోలో తారా రారా' పాట పాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై భూపిందర్ సింగ్ అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. గతంలోనూ ఆయన డ్రంకెన్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలపై ఇటువంటి పాటల ద్వారానే అవగాహన కల్పించారు.


ఇటువంటి వినూత్న ప్రయోగాల వల్ల ప్రజలు ట్రాఫిక్ నిబంధనల గురించి శ్రద్ధగా విని నేర్చుకుంటున్నారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం భారీ జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని ఆయన అవగాహన కల్పిస్తున్నారు.