ఉత్త‌ర మెక్సికోలో భీక‌ర ప‌రిస్థితులు

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 18, 2019, 05:18 PM
 

హైద‌రాబాద్‌: ఉత్త‌ర మెక్సికోలో భీక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. భ‌ద్ర‌తా ద‌ళాలు, డ్ర‌గ్ కార్ట‌ల్స్ మ‌ధ్య హోరాహోరీ ఫైరింగ్ జ‌రుగుతున్న‌ది. డ్ర‌గ్ డాన్ జాక్విన్ ఎల్ చాపో గుజ్‌మ‌న్‌ను కుమారుడు ఒవిడో గుజ్‌మ‌న్ లోపేజ్‌ను అరెస్టు చేయ‌డంతో ప‌రిస్థితి మ‌రింత భ‌యాన‌కంగా మారింది. కులేషియ‌న్ సిటీలో లోపేజ్‌ను అరెస్టు చేశారు. దీంతో గుజ్‌మ‌న్‌కు చెందిన సిన‌లోవా కార్ట‌ల్ గ్యాంగ్‌.. పెను విధ్వంసానికి పాల్ప‌డింది. భారీ ఆయుధాల‌తో రోడ్డుపైకి వ‌చ్చిన ఆగంత‌కులు.. పోలీసులపై ఫైరింగ్‌కు దిగారు. ర‌హ‌దారుల‌న్నీ ర‌క్త‌సిక్తం అయ్యాయి. వాహ‌నాల‌ను కూడా త‌గ‌ల‌బెట్టారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో.. గుజ్‌మ‌న్ లోపేజ్‌ను పోలీసులు విడుద‌ల చేశారు. చెల‌రేగుతున్న హింస‌ను అదుపు చేయాల‌న్న ఉద్దేశంతో పోలీసులు ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ అప్ప‌టికే ఆలస్యం జ‌రిగింది. అమెరికాకు అక్ర‌మ మార్గంలో మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో ఎల్ చాపో గుజ్‌మ‌న్ దిట్ట‌. ఎన్నో ఏళ్ల‌ ప్ర‌య‌త్నం త‌ర్వాత అమెరికా పోలీసులు ఎల్‌చాపోను కొన్నాళ్ల క్రితం అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం అత‌ను అమెరికా ఆధీనంలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయ‌న కుమారున్ని పోలీసులు అరెస్టు చేయ‌డంతో.. ఎల్‌చాపో కార్ట‌ల్‌కు చెందిన గ్యాంగ్ ఉత్త‌ర మెక్సికోలో విచ‌క్ష‌ణార‌హితంగా హింస‌కు దిగుతున్న‌ది. ఇటీవ‌లే ఓ కార్ట‌ల్ జ‌రిపిన దాడిలో సుమారు 14 మంది పోలీసులు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.