9 లక్షల వెబ్ సైట్ లను నిషేదించిన పాక్

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 27, 2019, 06:02 PM
 

దైవదూషణ, పోర్నోగ్రఫీ, ఆర్మీ, దేశ వ్యతిరేక కంటెంట్ కలిగి ఉన్న 9 లక్షల వెబ్‌సైట్లను పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికంకు చెందిన జాతీయ అసెంబ్లీ స్థాయి సంఘానికి ఈ మేరకు పాకిస్థాన్ టెలికం అథారిటీ (పీటీఏ) తెలియజేసినట్టు డాన్ న్యూస్ పేర్కొంది. సైబర్ క్రైమ్‌కు సంబంధించిన సమాచారం పీటీఏ వద్ద ఉండదని, ఐటీ, మొబైల్ టెలిఫొనీకి సంబంధించి నేర కార్యకలాపాల సంగతి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూసుకుందని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పీటీఏ పేర్కొంది.


సమావేశం అనంతరం పాకిస్థాన్ ఐటీ, టెలికం మంత్రి ఖాలిద్ మక్బూల్ సిద్దిఖీ మాట్లాడుతూ.. ఐటీ సహా అనేక రంగాల్లో పాకిస్థాన్ ఇప్పటికే వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారిక కార్యకలాపాలను ఈ-గవర్నెన్స్‌లోకి మార్చకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మరింత దిగజారుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటీని పెద్ద ఎత్తున ఉపయోగించడం వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.