మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం - అక్కడ హౌడీ మోదీ పేరిట ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం - ఆ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కావడం - ఈ సందర్భంగా సభకు వచ్చిన అశేష ఎన్నారై సమాజాన్ని చూసి మరింత ఉత్సాహంగా కనిపించిన మోదీ... ట్రంప్ చేయి పట్టుకుని ఎన్నారైల వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ట్రంప్ చేయి పట్టుకున్న మోదీ... అమెరికా అధ్యక్షుడిని ఏకంగా లాక్కెళుతున్నట్లుగా కనిపించిన దృశ్యాలు నిజంగానే వైరల్ అయ్యాయి. అంతేకాకుండా హౌడీ మోదీ సభకు హాజరైన ఎన్నారై జనసంద్రాన్ని చూసిన మోదీ... ప్రపంచంలోనే తన స్థాయికి తగ్గ నేత ఎవరూ లేరన్న కోణంలోనూ ఓ రేంజి స్పీచ్ ను వదిలారు. మరి ఈ స్పీచ్చో - లేదంటే... మోదీ చేతిలో చేయి వేసి ఆయనను అనుసరించడం మినహా గత్యంతరం లేదన్నట్లుగా నడిచిన ట్రంప్ తీరో తెలియదు గానీ.. ట్రంప్ ను కూడా కాషాయం పార్టీలోకి చేర్చేశారన్న కోణంలో సోషల్ మీడియాలో ఓ వైరల్ పోస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ పోస్ట్ లో ఏముందంటే... ట్రంప్ కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారట. ఈ మేరకు ట్రంప్ పేరిట ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం జారీ చేసిన గుర్తింపు కార్డును సదరు పోస్ట్ లో పెట్టేశారు. ఈ పోస్ట్ ను చూసిన వారంతా ముక్కున వేసుకోగా.. కాస్తంత తేరుకున్న తర్వాత ఈ ట్రంప్... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాదులే... హిందూస్థాన్ ట్రంప్ అంటూ ఓ రేంజిలో సెటైర్లు పడిపోతున్నాయి. మోదీ అమెరికా పర్యటన పుణ్యమా? అని ఇప్పుడు ట్రంప్ కూడా బీజేపీ నేతగా మారిపోయారే అని కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు.