ట్రెండింగ్
Epaper    English    தமிழ்

72 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమికులు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2019, 08:12 PM

పెళ్లయిన 8 నెలలకే దేశంలో చోటుచేసుకున్న పరిణామాలతో విడిపోయిన భార్య భర్తలు తిరిగి 72 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఇది నిజం. సినిమాను తలదన్నేలా ఉన్న ఈ 1946 లవ్ స్టోరీ వివరాల్లోకి వెళ్తే.. అది కేరళలోని కన్నూరు ప్రాంతం.. 1946లో ఈకే నారాయణన్ నంబియార్, శారద పెళ్లి చేసుకున్నారు. అప్పుడు శారద వయసు 13 ఏళ్లు కాగా, నారాయణన్ వయసు 18 ఏళ్లు. 1946లో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లిగా మారింది. కానీ దురదృష్టం కొద్దీ, నాటి రాజకీయ పరిస్థితుల వల్ల అదే ఏడాది వీరిద్దరూ దూరమయ్యారు. 8 నెలలకే వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. కన్నూరులోని చాలా వరకు వ్యవసాయ భూములు కరకట్టిదమ్ నయనార్‌ అనే భూస్వామి అధీనంలో ఉండేవి. అతడి దగ్గరున్న తమ భూములను దక్కించు కోవడం కోసం రైతులు తిరుగుబాటు చేశారు. నారాయణన్, ఆయన తండ్రి తలియన్ రామన్ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నారాయణన్ నంబియార్ జైలుకు వెళ్లడం జరిగింది. ఎనిమిదేళ్ల తర్వాత 1954లో నారాయణన్ సేలం జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్నారు. తన భార్యకు రెండో పెళ్లయ్యిందని తెలుసుకున్న ఆయన కూడా మరో పెళ్లి చేసుకున్నారు. నారాయణన్‌ దంపతులకు ఏడుగురు సంతానం కలిగారు. నారాయణన్ నంబియార్ జీవితం ఆధారంగా ఆయన మేనకోడలు శాంత కవుంబయి.. ‘డిసెంబర్ 30’ పేరిట ఓ నవల కూడా రాశారు. తర్వాత శారద కొడుకు భార్గవన్ ఆమెను కలిశారు. వీరి చొరవతో నారాయణన్, శారద కలిశారు. 72 ఏళ్ల తర్వాత తన మొదటి భార్యను కలిసిన నారాయణన్.. ప్రేమతో ఆమె తలను నిమరారు. ఆయన్ను చూడగానే శారద సిగ్గుతో తలదించుకుంది. ఆమె మధ్యమధ్యలో ఆయనవైపు చూస్తుంటే.. నారాయణన్‌కు 13 ఏళ్ల శారద గుర్తొచ్చింది. నారాయణన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఆయన కుటుంబ సభ్యులు తనను సొంత కూతురిలా ఆదరించారని శారద తన పిల్లలతో చెప్పి మురిసిపోయేదట. వెళ్లే ముందు.. నేను వెళ్తున్నానని నారాయణన్ చెప్పగా.. ఆమె తల పైకెత్తకుండానే.. ఒకింత సిగ్గుతో సరేనని బదులిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com