లోకేశ్ మద్దతుగా మంగళగిరిలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాకపోయి నా ఇంత అభివృద్ధి చేస్తే.. మంగళగిరి నుంచి ఎన్నికైతే ఇంకెంత చేస్తారో ఆలోచించాలని ప్రజల్ని కోరారు. రాబోయే ఐదేళ్లలో మరిన్ని సంస్థలు తీసుకొస్తామని చెప్పారు. మంత్రి నారా లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 42 సంస్థలను తీసుకొచ్చారని.. వాటి ద్వారా 3500 మందికి ఉపాధి కలిగిందని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు లోకేశ్ ప్రత్యేక మేనిఫెస్టోని ప్రకటించారని ఆమె చెప్పారు. స్థానిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని దాన్ని రూపొందించారన్నారు. ముస్లిం మైనారిటీల స్వయం ఉపాధికి ప్రభుత్వమే నేరుగా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకొంటామన్నారు. మేమంతా ఇక్కడే ఉంటున్నామని.. మంగళగిరి నియోజకవర్గంలోనే ఇల్లు, ఓటు హక్కు ఉన్నాయని చెప్పారు. సమస్యలు చెప్పుకొనేందుకు కుప్పం ప్రజల్లాగే.. మంగళగిరి ప్రజలకూ తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. లోకేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె కోరారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఓ వృద్ధురాలు బ్రాహ్మణికి రూ.500 విరాళంగా ఇచ్చారు. ఆ వృద్ధురాలికి బ్రాహ్మణి కృతజ్ఞతలు తెలిపారు.