ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదుల దాడిలో అమరులైన 44 మంది జవాన్లు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 09:26 AM

  జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి నరమేధానికి తెగబడ్డారు. పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీతో ఆత్మాహుతి దాడికి తెగబడటంతో దాదాపు 44 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. 


ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఇప్పటివరకు కశ్మీర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. 2016లో యురిలోని సైనికస్థావరంపై దాడి చేసి 18 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న ముష్కరులు ఆ తర్వాత జరిపిన అతిపెద్ద దాడి ఇదే. జమ్ము నుంచి పూల్వామాకు 78 వాహనాలతో సీఆర్ఫీఎఫ్ జవాన్లు వెళ్తుండగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.  


100 కిలోల పేలుడు పదార్థాలను నింపిన స్కార్పియో కారుతో ఆత్మాహుతి బాంబర్ ఢీ కొనడంతో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు తునాతునకలైంది. దుండగుడు పేలుడు పదార్థాలు నింపిన వాహనాన్ని రోడ్డుకు రాంగ్ సైడ్‌లో నడుపుకుంటూ వచ్చి బస్సును ఢీకొట్టాడని, ఆ బస్సులో 39 నుంచి 44 మంది వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారని ఘటనా స్థలం వద్ద ఓ అధికారి తెలిపారు. ఆ బస్సులోని వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని, అయినా ఆ బస్సులో మొత్తం ఎంతమంది జవాన్లు ప్రయాణిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శక్తిమంతమైన ఈ పేలుడు ధాటికి బస్సు మొత్తం ఇనుప ముద్దలా మారిపోయింది. దాదాపు 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ పేలుడు శబ్దం వినిపించింది.  


ఈ దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కచ్చితంగా ఎంతమంది గాయపడ్డారో చెప్పలేదు. మృతుల శరీరాలు తునాతునకలవడంతో వారిని గుర్తించడం వైద్యులకు చాలా కష్టంగా మారిందని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు ఢిల్లీలో పీటీఐకి చెప్పారు. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించినట్టు స్థానికులు చెప్తుండటంతో ఒకరికంటే ఎక్కువమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ధాటికి మృతిచెందిన జవాన్ల శరీరభాగాలు, ఆ బస్సు శిథిలాలు చెల్లాచెదురవడంతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది.  


ఈ కాన్వాయ్‌లో పలు బస్సులు, ట్రక్కులు, ఎస్‌యూవీలు సహా మొత్తం 78 వాహనాలున్నాయి. ఒక్కో బస్సు లేదా ట్రక్కులో 35 నుంచి 40 మంది చొప్పున మొత్తం 2,547 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సెలవు నుంచి తిరిగివచ్చి విధుల్లో చేరేందుకు వెళ్తున్నవారే. సాధారణంగా ఒక కాన్వాయ్‌లో దాదాపు వెయ్యిమంది సిబ్బంది ఉంటారని, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆ రహదారిపై మూడ్రోజులుగా వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో ఒకేసారి ఎక్కువమంది సిబ్బంది బయలుదేరారని అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టే సాయుధ వాహనాల కాన్వాయ్‌లో ఉందని తెలిపారు. దాడిలో ధ్వంసమైన బస్సు సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందినది.  


ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ కమాండో అనే ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటూ.. జేఈఎం అతని వీడియోను విడుదల చేసింది. ఆదిల్ దార్ రైఫిళ్లను చేతపట్టుకుని జేఈఎం బ్యానర్ల ముందు నిలబడిన దృశ్యం ఇందులో కనిపిస్తున్నది. పుల్వామా జిల్లా కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ అహ్మద్ దార్ గతేడాది జేఈఎంలో చేరినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దాడిపై దర్యాప్తులో పాలుపంచుకునేందుకు ఉగ్రవాద వ్యతిరేక కమాండో దళం ఎన్‌ఎస్జీ నిపుణులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులను జమ్ము-కశ్మీర్‌‌కు చేరుకున్నారు. ఇవాళ వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయనున్నారు.  


జమ్ముకశ్మీర్ నిత్యం ఉగ్రదాడులతో సతమతమవుతున్నది. నిన్న పుల్వామా జిల్లాలో జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడి.. కశ్మీర్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఉగ్రదాడి. 2001లో ఇలాంటి ఉగ్రదాడే శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. అప్పుడు 38 మంది మరణించగా.. 40 మంది గాయపడ్డారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అలాంటి ఆత్మాహుతి దాడి జరుగడంతో కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  


జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పరిధిలో భారీ వాహనాలతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ బయలు దేరుతున్న సమాచారం ఉగ్రవాదులకు ముందే లీకై ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. భారీ స్థాయిలో బలగాలు కాన్వాయ్‌గా బయలుదేరుతున్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుందన్నారు. అటువంటి వారే ఉగ్రవాదులకు ఈ సమాచారం అందించి ఉంటారు అని ఒక భద్రతా దళం అధికారులు అనుమానిస్తున్నారు.భారీగా బయలుదేరిన కాన్వాయ్ విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా? ఏమైనా అవకతవకలు చోటు చేసుకున్నాయా? అనేది విచారణలో తేలుతుందన్నారు.  


సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌కు అండగా నిలుస్తామని స్పష్టంచేసింది. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపింది. ముష్కర మూకలపై పోరాడటంలో, ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందన్నారు. ఇదే బాటలో ఫ్రాన్స్, రష్యా, నేపాల్ తో పాటు చాలా దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com