ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఎన్నికలు ప్రచారంలో కీలక అంశాలేంటి?

international |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 12:08 PM

భారత్‌లో ప్రధానంగా కొన్ని రకాల అంశాల చుట్టూ ఎన్నికలు, రాజకీయాలు తిరుగుతుంటాయి. వాటిలో కులం, మతం, ఉచిత పథకాలు వంటివి ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతుంటారు .మరి, అమెరికాలో ఎన్నికల ప్రచారం ప్రధానంగా దేనిపై నడుస్తుంది? ఎలాంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి?వీటి గురించి తెలుసుకునేందుకు అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని 'బీబీసీ తెలుగు' సంప్రదించింది.భారత్‌లో జాతీయ స్థాయిలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ, ప్రాంతీయ పార్టీలు అనేకం. ఎన్నికల్లో వాటి ప్రభావం కూడా చాలా ఎక్కువే.కానీ, అమెరికాలో ఎక్కువగా రెండు రాజకీయ పార్టీల చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఒకటి డెమొక్రటిక్ పార్టీ, ఇంకొకటి రిపబ్లికన్ పార్టీ. ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డోనల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు."విద్య, ఉపాధి, ఆర్థిక ప్రగతి, వైద్య రంగం, ఇమ్మిగ్రేషన్ పాలసీలో సంస్కరణలు వంటి అంశాల చుట్టే అమెరికాలో ప్రధానంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది" అని లోకేశ్ ఆర్ ఎదారా చెప్పారు.


లోకేశ్ వెస్ట్రన్ మిషిగన్ యూనివర్సిటీలోని మెడిసిన్ విభాగంలో క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. గతంలో తానాకు చైర్మన్‌గా కూడా వ్యవహరించారు."చాలా సర్వేల్లో ఈ అంశాలపైనే ఓటర్లు ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. పీఈడబ్ల్యూ రీసర్చ్ సెంటర్ వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాలు గ్రౌండ్ రియాలిటీని తెలియజేసేలా ఉన్నాయి" అని లోకేశ్ చెప్పారు."భారత్‌లో మాదిరి కులం, మతం గురించి ఇక్కడ బహిరంగంగా ప్రస్తావించరు. కానీ, అంతర్లీనంగా దీని ప్రభావం అయితే కచ్చితంగా ఉంటుంది" ప్రసాద్ జాలాది చెప్పారు.ఈయన 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. టెక్సస్‌లో ఉండే ప్రసాద్, పర్యావరణ పరిరక్షణకు పనిచేసే 'సురక్ష' సంస్థ వ్యవస్థాపకులు.


 


"క్రైస్తవ మతం, తెల్ల-నల్ల జాతి, దక్షిణాసియా, స్పానిష్ మాట్లాడేవాళ్లు.. ఇలా రకరకాలైన గ్రూపులు ఉంటాయి. అయితే, సభల్లో కాకుండా ప్రైవేట్ మీటింగ్స్‌లో ఫలానా వారు మన గ్రూప్‌కు చెందిన వారు కాబట్టి వాళ్లకు ఓటేయండి అంటూ అభ్యర్థిస్తారు" అని ప్రసాద్ జాలాది చెప్పారు.


ఎన్నికల ప్రక్రియలో కొన్ని తేడాలు


అమెరికాలో మూడు రకాలుగా ఓటు వేయవచ్చు. అవి, ఎన్నికల రోజు నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం, అబ్సెంటీ ఓటింగ్ త్రూ మెయిల్, ఎర్లీ ఓటింగ్ ఇన్-పర్సన్.భారత్‌లో 5 ఏళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అంతేకానీ, ఖచ్చితంగా ఫలానా రోజుల్లోనే లేదా ఫలానా నెలలోనే జరగాలనే సంప్రదాయమేమి లేదు.


 


అమెరికాలో మాత్రం అలా కాదు, నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా నవంబర్‌లో తొలి సోమవారం తరువాత వచ్చే రోజు (మంగళవారం) ఎన్నికలు జరుగుతాయి. 1845 నుంచి ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఈ స్వతంత్ర సంస్థకు సర్వఅధికారాలు ఉంటాయి.అమెరికాలో ఎన్నికల నిర్వహణను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ (ఎఫ్‌ఈసీ), యూఎస్ ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్ (ఈఏసీ)లు చూసుకుంటాయి.


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తేడాలే కనిపిస్తాయి.


"మనం భారత్‌కు చెందిన వాళ్లం కాబట్టి మన దేశంతో పోల్చుకుంటాం. అది సహజం. కానీ, అది సరికాదు. ఎందుకంటే, అమెరికా ప్రజాస్వామ్య ప్రస్థానం మొదలై 240 ఏళ్లు దాటింది. భారత్ ప్రస్థానం 77 ఏళ్లు మాత్రమే. అమెరికా స్థాయికి చేరుకోవడానికి సమయం పడుతుంది. అన్ని రంగాల్లో అమెరికాతో పోటీ పడే మనం.. ఎన్నికలను చూసే కోణం, నిర్వహణలోనూ పోటీపడాల్సిన అవసరం ఉంది" అని ప్రసాద్ జాలాది సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com