ట్రెండింగ్
Epaper    English    தமிழ்

870 రేటింగ్ పాయింట్స్‌తో నం.01 టెస్టు బౌల‌ర్‌గా బుమ్రా

sports |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 05:25 PM

తాజాగా విడుద‌లైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా నం.01 స్థానం కైవ‌సం చేసుకున్నాడు. ఇటీవ‌ల ముగిసిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 870 రేటింగ్ పాయింట్ల‌తో నం.01 ర్యాంక్ ద‌క్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను వెన‌క్కి నెట్టి మ‌రీ బుమ్రా నంబ‌ర్‌వ‌న్‌ స్థానంలో నిలిచాడు. అశ్విన్ 869 రేటింగ్ పాయింట్ల‌తో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో ఇలా ఇద్ద‌రు భార‌త బౌల‌ర్లు మొద‌టి రెండు స్థానాల్లో నిల‌వ‌డం విశేషం. ఇక బంగ్లాతో టెస్టు సిరీస్‌లో ఈ ఇద్ద‌రూ కూడా చెరో 11 వికెట్లు ప‌డ‌గొట్టిన విష‌యం తెలిసిందే. కానీ, బుమ్రా మంచి ఎకాన‌మీతో బౌలింగ్ చేయ‌డం అత‌నికి క‌లిసొచ్చింది.ఈ ఇద్ద‌రి త‌ర్వాత టాప్‌-5లో హేజిల్‌వుడ్‌, పాట్ క‌మిన్స్‌, క‌గిసో ర‌బాడ ఉన్నారు. అలాగే టీమిండియా మ‌రో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇంగ్లండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో స‌మ‌యంలోనూ జ‌స్ప్రీత్ బుమ్రా నం.01 ర్యాంక్ సాధించాడు. అప్పుడు కూడా మూడు స్థానాలు ఎగ‌బాకి అశ్విన్‌ను వెన‌క్కి నెట్టి నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచాడు. మ‌రోవైపు ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ కూడా బుమ్రానే. 2024లో ఇప్ప‌టివ‌ర‌కు 7 టెస్టులు ఆడిన పేస‌ర్ ఏకంగా 38 వికెట్లు ప‌డగొట్టాడు. అటు శ్రీలంక స్పిన్న‌ర్ ప్ర‌భాత్ జ‌య‌సూర్య కూడా ఏడు టెస్టులే ఆడి 38 వికెట్లే తీశాడు. కానీ, బౌలింగ్ స‌గ‌టులో మాత్రం మ‌నోడే మెరుగ్గా ఉన్నాడు. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జో రూట్, కేన్ విలియ‌మ్స‌న్, య‌శ‌స్వి జైస్వాల్ మొద‌టి మూడు స్థానాల్లో నిలిచారు. భార‌త యువ సంచ‌ల‌నం జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకొని మూడో ర్యాంక్ ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే కింగ్ కోహ్లీ ఆరు స్థానాలు ఎగ‌బాకి ఆరో ర్యాంకులో నిలిస్తే.. రిష‌భ్ పంత్ మూడు స్థానాలు దిగ‌జారి 9వ స్థానానికి చేరాడు. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఐదు స్థానాలు దిగ‌జారి 15వ స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com