ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెజ్‌బొల్లా చీఫ్ హాసన్ నస్రల్లా మృతి.. ఇక ప్రపంచాన్ని వణికించలేడు: ఇజ్రాయెల్

international |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 11:04 PM

గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న దాడుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన భీకర దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత హాసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇక ఉగ్రవాదంతో హెజ్‌బొల్లా చీఫ్ ప్రపంచాన్ని వణించలేడని పేర్కొంది. ఇక హెజ్‌బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు.. ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రతిజ్ఞ చేసిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. ఇక అమెరికాలో ఉన్న నెతన్యాహు.. హుటాహుటిన తన పర్యటనను రద్దు చేసుకుని మరీ ఇజ్రాయెల్‌కు పయనం కావడం గమనార్హం. అయితే హాసన్ నస్రల్లా మృతిని ఐడీఎఫ్ ధ్రువీకరించగా.. హెజ్‌బొల్లా గానీ, లెబనాన్ గానీ ఇంకా స్పందించలేదు.


హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని.. ఇజ్రాయెల్‌ సైన్యం శుక్రవారం భీకర దాడికి దిగింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ట్విటర్ వేదికగా వెల్లడించింది. హెజ్‌బొల్లా చీఫ్ హాసన్ నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు అంటూ పేర్కొంది. మరోవైపు.. ఈ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్‌ వార్‌ రూమ్‌.. ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌ మిషన్‌ సక్సెస్ అయినట్లు వెల్లడించింది.


దక్షిణ లెబనాన్‌లోని దాహియాలో ఇళ్ల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా హెడ్ క్వార్టర్స్‌పై ఐడీఎఫ్‌.. శుక్రవారం రాత్రి భారీ వైమానిక దాడులకు దిగింది. అయితే ఆ సమయంలో నస్రల్లా అందులోనే కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో ఆ భవనం పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొంది. ఈ భీకర దాడిలో నస్రల్లా సహా అక్కడ ఉన్న వారు ఎవరూ బతికే అవకాశాలు లేవని ఐడీఎఫ్‌ తేల్చి చెప్పింది. ఆ తర్వాత అతడు మృతిచెందినట్లు స్పష్టం చేసింది.


ఇక ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో ఆరుగురు మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే హాసన్ నస్రల్లా చనిపోయాడా లేదా అనేది మాత్రం హెజ్‌బొల్లా ఇంకా ప్రకటించలేదు. అయితే శుక్రవారం రాత్రి నుంచి నస్రల్లా కాంటాక్ట్‌లో లేడని హెజ్‌బొల్లా వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు.. హాసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా మరణించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది. దక్షిణ బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో జైనబ్‌ నస్రల్లా హతమైనట్లు తెలిపాయి.


మరోవైపు.. శనివారం ఉదయం కూడా లెబనాన్‌లోని బెకా వ్యాలీలో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఇందులో హెజ్‌బొల్లా క్షిపణి యూనిట్ కమాండర్‌ మహమ్మద్‌ అలీ ఇస్మాయిల్‌ను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మరోవైపు బీరుట్‌లో దాడులకు ప్రతీకార దాడులకు దిగిన హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో విరుచుకుపడింది.


ఇక హెజ్‌బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఐక్యరాజ్య సమితిలో ప్రతిజ్ఞ చేసిన కొద్దిసేపటికే.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగింది. బంకర్లను కూడా భూస్థాపితం చేసే భారీ బాంబులతో వైమానిక దాడులు చేసింది. ఈ బాంబు పేలుళ్ల ధాటికి ఏకంగా 30 కిలోమీటర్ల దూరంలోని ఇళ్ల కిటికీలు, అద్దాలు సైతం పగిలిపోయినట్లు తెలుస్తోంది. ఇక గురువారం చనిపోయిన హెజ్‌బొల్లా కమాండర్‌ అంత్యక్రియలు జరిగిన గంట సేపటికే బీరుట్‌పై దాడులు జరగడం గమనార్హం.


ఇక అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఈ దాడుల గురించి తెలిసి వెంటనే తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఇజ్రాయెల్ బయల్దేరారు. హాసన్ నస్రల్లా చనిపోయారని ధ్రువీకరించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఇజ్రాయెల్ రక్షణ, సైనిక, పాలనా వర్గాలతో చర్చించేందుకు బెంజమిన్ నెతన్యాహు తిరిగి వస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక హాసన్ నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడి ఘటన నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం ఖమేనీ తన నివాసంలో జాతీయ భద్రతా మండలితో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఇరాన్ వర్గాలు హాసన్ నస్రల్లా సమాచారం గురించి ఆరా తీస్తోంది.


ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైనట్లు వెలుగులోకి వచ్చిన వార్త సంచలనంగా మారింది. హెజ్‌బొల్లా గురించి, హసన్ నస్రల్లా గురించి, అతడు హెజ్‌బొల్లా చీఫ్‌గా ఎదిగిన తీరు గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. దీంతో హసన్ నస్రల్లా గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాడు. భారత్‌లో జమ్మూ కాశ్మీర్, మిజోరాం, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో నస్రల్లా మరణవార్త గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com