ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. తనలా కొడుకు బాధపడకుండా.. ఐదేళ్లకే కట్టబెట్టిన స్టాలిన్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 10:52 PM

తమిళనాడులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభించింది. తమిళనాడు మూడో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి నియమితులయ్యారు. మనో తంగరాజ్‌తోపాటు మరో ముగ్గుర్ని కేబినెట్ నుంచి తప్పించిన స్టాలిన్.. మనీలాండరింగ్ కేసులో జైలుకెళ్లి.. మూడు రోజుల క్రితమే బెయిల్ మీద బయటకొచ్చిన సెంథిల్ బాలాజీని కేబినెట్లోకి తీసుకున్నారు. ఆర్.రాజేంద్రన్, డాక్టర్ గోవి చెళియన్, ఎస్ఎం నాజర్‌లు సైతం ఆదివారం సాయంత్రం తమిళనాడు మంత్రులుగా ప్రమాణం చేశారు.


డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్.. సినీ నటుడిగా ప్రజలకు పరిచయం అయ్యారు. 2008 ప్రొడ్యూసర్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి.. 2012లో ఒరు కాల్ ఒరు కన్నడి సినిమా ద్వారా హీరోగా మారారు. ఓకే ఓకే పేరిట తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది.


2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్- తిరువల్లికెని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉదయనిధి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి రావడంతో.. ఆయన తండ్రి స్టాలిన్ సీఎం అయ్యారు. 2022 డిసెంబర్ 14న యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. మంత్రి పదవి చేపట్టి రెండేళ్లు తిరగక ముందే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందారు.


2019లో డీఎంకే యువ విభాగం కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ఉదయనిధి.. ఐదేళ్లలోనే డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. ఉదయనిధి ఎదిగిన తీరు చూస్తే.. దాని వెనుక స్టాలిన్ పక్కా ప్లానింగ్ ఉన్న విషయం అర్థమవుతుంది. రాజకీయాల్లోకి రాక ముందే ఉదయనిధి సినిమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా వేగంగా ఒక్కో మెట్టు ఎక్కారు. ఇక మిగిలింది.. తన తాత కరుణానిధి, తండ్రి స్టాలిన్ బాటలో సీఎం పగ్గాలు చేపట్టడమే.


స్టాలిన్ ప్లానింగ్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. 1953లో పుట్టిన స్టాలిన్ 20 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1982లోనే ఆయన డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1984లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. కానీ 1989 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996లో చెన్నై మేయర్‌గా ఎన్నికయ్యారు. 2006లో తన తండ్రి కరుణానిధి కేబినెట్లో మంత్రి పదవిని పొందారు. 2009లో డిప్యూటీ సీఎం అయిన స్టాలిన్.. 2011 ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయేంత వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2011, 2016 ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చింది. (2017-2021 మధ్య పన్నీరు సెల్వం తమిళనాడు డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు).


కరుణానిధి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేయడం, అన్న అళగిరి వారసత్వం కోసం పోటీలో ఉండటంతో.. సీఎం పదవి కోసం స్టాలిన్ సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. 2018లో కరుణానిధి కన్నుమూసిన తర్వాత డీఎంకే పార్టీ పూర్తిగా స్టాలిన్ నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించడంతో స్టాలిన్ 68 ఏళ్ల వయసులో తమిళనాడు సీఎం అయ్యారు.


విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టాలిన్.. సీఎం పీఠాన్ని అధిష్టించడానికి దాదాపు 50 ఏళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇన్నేళ్లపాటు ఆయన తండ్రికి అండగా ఉంటూ.. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతో ఓర్పుగా ఎదురు చూశారు. 1989లోనే ఎమ్మెల్యేగా గెలిచిన స్టాలిన్‌కు.. డిప్యూటీ సీఎం కావడానికి 30 ఏళ్లు పట్టింది. కానీ ఆయన కొడుకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన ఐదేళ్లకే ఉపముఖ్యమంత్రి కాగలిగారు.


స్టాలిన్‌‌కు ఉదయనిధి ఒక్కడే మగ సంతానం కావడంతో.. స్టాలిన్ ఎదుర్కొన్న వారసత్వ పోరు ఆయన కొడుక్కి లేకుండా పోయింది. స్టాలిన్‌ వయసు 70 ఏళ్లు దాటడంతో.. తన వారసుడిగా ఉదయనిధిని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇక మిగిలింది డీఎంకే పగ్గాలు అప్పగించడం.. ఇప్పుడు కాకున్నా, ఒక వేళ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గెలిస్తే సీఎం పదవి అప్పగించడమే మిగిలింది. ఉదయనిధి సీఎం కుర్చీ ఎక్కేది ఎన్నడనేది.. సినీ నటుడు విజయ్ పెట్టిన కొత్త పార్టీ ప్రభావం, అన్నాడీఎంకే ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై ఆధారపడి ఉండొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com