కుల ఆధారిత గణనకు ప్రధాని సై

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 07, 2019, 11:19 PM
 

*చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు పరిశీలిస్తానన్న మోడీ


*నరేంద్రమోడీతో భేటీ అయిన నూకారపు సూర్యప్రకాశరావు


*ఓబీసీ, బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేత


*క్రీమిలేయర్‌ నుంచి ఓబీసీలను మినహాయించాలి


*క్రీమిలేయర్‌ విధానాన్ని పూర్తిగా రద్దుచేయాలి


*కేంద్రంలోని బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఓబీసీలతో భర్తీచేయాలి


* ఇతర వెనుకబడిన తరగతులను ఇతర వెనుకబడిన కులాలుగా మార్చాలి


(న్యూఢిల్లీ నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి)


కుల ఆధారిత జనాభా గణనను చేపట్టడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సుముఖత వ్యక్తంచేశారు. అదే సందర్భంలో చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ మాదిరిగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.  సూర్య-ఎస్‌పీఆర్‌ గ్రూప్‌ అధినేత నూకారపు సూర్యప్రకాశరావు న్యూఢిల్లీలో గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీ రిజర్వేషన్లతోపాటు ఇతర బీసీల సమస్యలపై మోడీకి నూకారపు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. బడుగులు, అణగారిన వర్గాలు, విస్మరించిన, ఇతర వెనకబడిన తరగతులకు చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు  జారీచేయాలని ఆ వినతిపత్రంలో కోరారు. ఓబీసీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. జనాభాను లెక్కించేటప్పుడు కులాలను ప్రాతిపదికగా తీసుకొని శీఘ్రంగా గణన చేపట్టాలని సూచించారు. షెడ్యూల్‌‌డ కులాల మాదిరిగా ఇతర వెనకబడిన తరగతులను(ఓబీసీ) ఇతర వెనకబడిన కులాలుగా మార్చాలని విజ్ఞప్తిచేశారు. ఓబీసీలకు ఇస్తున్న 27శాతం రిజర్వేషన్లను 52శాతానికి పెంచాలని కోరారు.  ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ విధానాన్ని కేంద్రంలో తక్షణం అమలుచేయాలని నూకారపు ప్రధాన మంత్రికి విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ ఖాళీలను ఓబీసీలకు రిజర్వుచేసిన 27శాతంలో భర్తీచేయాలని విన్నవించారు. చట్టసభలలో  ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులకు ఓబీసీ రిజర్వేషన్లను  అమలుచేయాలని నూకారపు కోరారు. తాను చేసిన ఈ సూచనలను మానవీయ దృక్పథంతో పరిశీలించి పరిగణనలోనికి తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీని నూకారపు విజ్ఞప్తిచేశారు.