ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో టీచర్‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 08:18 PM

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా ఎన్నికయ్యారు.. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ సీఎం కాబోతున్న అతిశీ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.. ఆమె ఏపీలో టీచర్‌గా పనిచేశారు.


ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె 2003 జులై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్‌గా విధులు నిర్వహించారు. అలాగే 6, 7 తరగతులకు ఇంగ్లీషు బోధించారు.. తమకు పాఠాలు చెప్పిన టీచర్ ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిసి పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమ స్కూల్లో టీచర్‌గా పనిచేసిన అతిశీ సీఎం కానుండటంతో.. రిషివ్యాలీ స్టాఫ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ రిషివ్యాలీ స్కూల్‌ను ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించారు.


ఆతిశీ 2013లో ఆప్‌లో చేరారు.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడేళ్లపాటు మనీశ్‌ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా విధులు నిర్వహించారు.. 2019 ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.


2023 ఫిబ్రవరిలో మనీశ్‌ సిసోడియా అరెస్ట్‌ తర్వాత ఆతిశీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లి మద్యం కుంభకోణం కేసులో మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ అరెస్ట్‌ కావడంతో ఆప్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఆతిశీ ఆర్థికశాఖసహా కీలక శాఖల బాధ్యతల్ని చూశారు. ఇప్పుడు ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. ఆతిశీ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్, త్రిప్తా వహి దంపతుల కుమార్తె.. ఆమె విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్‌లో జరిగింది. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ (హిస్టరీ) చేశారు.. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆప్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అలాగే మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com