ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. లేదా రాజకీయంగా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే మరో ముఖ్య నేత పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత సామినేని ఉదయభాను వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీన సామినేని ఉదయభాను జనసేన పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు 23వ తేదీన కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సామినేని ఉదయభాను భేటీ కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని గ్రామాల నాయకులకు, కార్యకర్తలకు సమాచారం అందించినట్లు తెలిసింది.
ఇక పార్టీలో చేరికపై జనసేన నాయకులతోనూ సామినేని ఉదయభాను పలుమార్లు చర్చించినట్లు సమాచారం. చేరికపై జనసేన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఈ నెలాఖరులో జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 24 లేదా 27వ తేదీన సామినేని ఉదయభాను జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా దిమ్మెలు, బ్యానర్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జగ్గయ్యపేటలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఆ పార్టీని వీడుతోంది. ఇప్పటికే జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మరికొంత మంది కౌన్సిలర్లతో పాటుగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక ఇప్పుడు సామినేని ఉదయభాను కూడా పార్టీ మారనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీడీపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కూడా సామినేని ఉదయభాను పార్టీ మారతారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఉదయభాను కూటమిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున శ్రీరామ్ తాతయ్య, వైసీపీ నుంచి సామినేని ఉదయభాను పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఉదయభాను మీద టీడీపీ అభ్యర్తి శ్రీరామ్ తాతయ్య 15 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.