నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయం వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. నూతన మద్యం పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేబినెట్ సమావేశంలో నూతన మద్యం విధానానికి ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్.. నాణ్యమైన మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అలాగే సగటు మద్యం ధరను రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇక వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి సైతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వరద బాధితులకు ఇంటి రూ.25 వేలు చొప్పున అందిస్తామని.. పంటలకు, పశువులకు సైతం పరిహారం అందిస్తామంటూ.. ఏ పంటకు ఎంత పరిహారం అనే వివరాలను చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన ఈ వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు మార్చే ప్రతిపాదనకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై భోగాపురం విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పిలవనున్నారు.
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనా టీడీపీ కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందించే పథకంపైనా మంత్రివర్గం చర్చించింది. వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలుపైనా మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం.
ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా బుడమేరు వాగుకు గండ్లు పడిన అంశం గురించి చర్చించినట్లు తెలిసింది. మరోసారి ఈ తరహా విపత్తులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులందరూ అభిప్రాయపడినట్లు సమాచారం. టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి కూడా మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు తెలిసింది.