ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆ పార్టీని వీడారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను కూడా పంపించారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. తొలి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వస్థీకరణలో అప్పట్లో మంత్రి పదవి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.
తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతగా పనిచేశారు. అనంతరం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వరుసగా విజయం సాధించారు. మంత్రిగానూ పనిచేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున మరోసారి ఒంగోలు నుంచి విజయం సాధించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని... వైసీపీ తరుఫున క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి గెలుపొందిన బాలినేని.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు.
అయితే మంత్రివర్గ పునర్వవస్థీకరణలో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించడం అప్పట్లో ఆయనలో అసంతృప్తికి కారణమైంది. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయంలోనూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయాలతో ఆయన విభేదిస్తూ వచ్చారు. ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు బాలినేని. అయితే వైఎస్ జగన్ మాత్రం.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో మరోసారి బాలినేని అసంతృప్తికి గురయ్యారు. 2024 ఎన్నికల్లో ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధనరావు చేతిలో ఓడిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై పోరాటం ప్రారంభించిన బాలినేని.. ఒంగోలులో రీకౌంటింగ్‌కు సైతం పట్టుబట్టారు. అయితే ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్టానం నుంచి తనకు ఏ మాత్రం మద్దతు లభించలేదని ఇటీవల అసంతృప్తి సైతం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే బాలినేని వైసీపీని వీడతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు ఆ ప్రచారం ప్రకారమే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పారు. అయితే కొన్ని కారణాలతోనే రాజీనామా చేసినట్లు బాలినేని చెప్పారు. రాజకీయాలు వేరు, కుటంబాలు, బంధుత్వాలు వేరన్న బాలినేని.. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని అన్నారు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది.