ఈ ఏడాది శీతాకాలంలో చలి పంజా విసరనుందా? గతంలో కంటే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయా? అంటే అవుననే అంటోంది భారత వాతావరణ విభాగం. రాబోయే శీతాకాలంలో చలి తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ముగిసిందని.. లా నినా ఏర్పడిందని వెల్లడించింది. అందువల్ల రాబోయే శీతాకాలం సీజన్‌లో భారత్‌లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. సాధారణంగా రుతుపవన కాలం ముగిసే సమయానికి లా నినా వల్ల ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల ఉంటుంది. తరచూ వర్షపాతం పెరగడంతో పాటు తీవ్రమైన శీతాకాలం వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
స్పానిష్ భాషలో లా నినా అంటే 'ది గర్ల్' అని అర్థం. దీనికి వ్యతిరేకం అయిన ఎల్ నినో ‘ది లిటిల్ బాయ్’. ఈ రెండు దృగ్విషయాలు పూర్తిగా వ్యతిరేక ప్రవర్తనలను ప్రదర్శిస్తాయి. లా నినా సమయంలో బలమైన తూర్పు గాలులు సముద్ర జలాలను పశ్చిమవైపునకు నెట్టడం వల్ల ఉపరితలం ముఖ్యంగా భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో జలాలు చల్లబడతాయి. ఎల్ నినో దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఉపరితల జలాల వేడెక్కి తూర్పు వైపు నుంచి అమెరికా పశ్చిమ తీరంవైపు ప్రయాణిస్తాయి.
లా నినా, ఎల్ నినో రెండూ ముఖ్యమైన సముద్ర, వాతావరణ దృగ్విషయాలు. ఇవి సాధారణంగా ఏప్రిల్- జూన్ మధ్య ప్రారంభమై... అక్టోబర్- ఫిబ్రవరి మధ్య బలపడతాయి. ఈ సంఘటనలు సాధారణంగా 9 నుంచి 12 నెలల మధ్య ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు రెండేళ్ల వరకు కొనసాగవచ్చు.
సాధారణంగా వాణిజ్య గాలులు భూమధ్యరేఖ వెంబడి పశ్చిమ దిశగా వీస్తాయి. దక్షిణ అమెరికా నుంచి వెచ్చని జలాలు ఆసియా వైపునకు ప్రవహిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల సముద్రపు అడుగు నుంచి నీరు చల్లబడటానికి, వాతావరణ సమతౌల్యత నిర్వహణకు సహకరిస్తుంది. అయినప్పటికీ, లా నినా ప్రారంభంలో ఈ సమతౌల్యతను దెబ్బతీస్తుంది. ఇది ప్రపంచ వాతావరణ మార్పులకు దారి తీస్తుంది. ఎల్ నినో పసిఫిక్‌లోని వెచ్చని గాలి, సముద్ర ఉష్ణోగ్రతలతో సంబంధం కలిగి ఉంటుంది, ఫలితంగా ప్రపంచం మొత్తం ఉష్ణోగ్రతలు వేడెక్కుతాయి. లా నినా సముద్ర ఉపరితలం, దాని పైన ఉన్న వాతావరణం రెండింటినీ చల్లబరచడం ద్వారా వ్యతిరేక ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. ప్రస్తుతం లా నినా యాక్టివ్‌గా మారినందున ఈ శీతాకాలంలో తీవ్రమైన పరిస్థితుల గురించి ఐఎండీ హెచ్చరిక రాబోయే వాతావరణ సవాళ్లకు సిద్ధం కావాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.