ఎమ్మెల్యేలు పార్టీలు మారడం సర్వసాధారణం. ఎన్నికలకు ముందు ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత మరో పార్టీలోకి వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పటివరకు ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు.. పార్టీ మారిన తర్వాత అదే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించడం మనకు కళ్లకు కనిపిస్తూనే ఉంది. ఇక ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన పార్టీలు వారిపై పార్టీ ఫిరాయింపుల కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత కోర్టులకు ఎక్కడం జరుగుతూనే ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో జరుగుతోంది ఇదే. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
పార్టీ ఫిరాయించి ఇతర పార్టీల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేలకు పింఛను సదుపాయాన్ని తొలగిస్తూ తీసుకొచ్చిన కొత్త బిల్లుకు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పార్టీ మారి.. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని ప్రభుత్వం నిలిపివేయనుంది. దీనికి సంబంధించిను సవరణ బిల్లును తాజాగా జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా బుధవారం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారిన తర్వాత అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ కొత్త చట్టం ప్రకారం పెన్షన్ కట్ చేయనున్నారు.
పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ సర్కార్ కీలక బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పింఛన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు - 2024ను.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బుధవారం ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో మెజార్టీ సభ్యులు బిల్లుకు మద్దతు తెలపడంతో అది సభ ఆమోదం పొందింది. ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత నుంచి పింఛను పొందే అవకాశాన్ని కోల్పోతారని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ చట్టాల ప్రకారం.. 5 ఏళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వారికి నెలకు రూ.36 వేల పింఛను అందుతుంది. ఇక 5 ఏళ్లు దాటి ఎమ్మెల్యేగా పనిచేసిన వారికి ప్రతి ఏడాదికి రూ.1000 చొప్పున అదనంగా పెన్షన్‌ను అందిస్తున్నారు. మరోవైపు.. ఈ ఏడాది మొదట్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల వేళ.. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడంతో.. అధికార పార్టీకి బలం ఉన్నా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ ఘటన తర్వాత హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ విప్ జారీ చేసినా.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు. దీంతో ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మళ్లీ గెలిచి సభలో అడుగుపెట్టగా.. మిగిలిన నలుగురు మాత్రం పరాజయం పాలయ్యారు.