ఉత్తర్‌ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా జనాలపై తోడేళ్ల గుంపు చేస్తున్న దాడులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకుని బంధించగా.. ఇక మిగిలిన తోడేళ్లు కనిపిస్తే కాల్చి పారేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఈ తోడేళ్ల దాడులు పెరుగుతుండటం సంచలనంగా మారింది. ఇప్పటివరకు 10 మందిపై దాడి చేసి చంపేసిన తోడేళ్లు.. మరో పదుల సంఖ్యలో జనాలను గాయపరిచి ఆస్పత్రుల పాలు చేశాయి. తోడేళ్ల దాడులతో అక్కడి జనం బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. వ్యూహాలు మార్చుకుంటూ కొత్త కొత్త గ్రామాలపై దాడులు చేస్తుండటంతో వాటిని పట్టుకోవడం అటవీ అధికారుల వల్ల కావడం లేదు.
ఆగస్టు నెలలో బహ్రైచ్ జిల్లాలోని పలు గ్రామాలపై 6 తోడేళ్ల గుంపు దాడులు జరిపాయి. చిన్నారులే లక్ష్యంగా గ్రామాలపై దాడులు చేస్తున్న ఈ తోడేళ్ల గుంపు కొన్ని రోజుల్లోనే 9 మంది పిల్లలను చంపేసింది. ఇందులో 4 తోడేళ్లను అటవీ అధికారులు బంధించగా.. మరో రెండు మాత్రం చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే వాటిని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. చివరి అవకాశంగా వాటిని కాల్చిపారేయాలని సూచించారు.
1997లో యూపీలో ఈ తోడేళ్ల దాడులు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత తిరిగి అలాంటి దాడులు జరుగుతున్నాయి. దీంతో అసలు తోడేళ్లు ఎందుకు దాడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి. బహ్రైచ్ జిల్లాలోనే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపై పర్యావరణ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ తోడేళ్ల దాడులపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తోడేళ్లలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుల గురించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ వన్యప్రాణి శాస్త్రవేత్త, మాజీ డీన్ డాక్టర్ వైవీ ఝాలా కీలక అంశాలు చెప్పారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని తెలిపారు. సహజంగా తోడేళ్లు ఎప్పుడూ మనుషులపై దాడులు చేయవని.. 1980లో ఒకసారి, 1997లో మరోసారి గ్రామాలపై పడి దాడులు చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సంఘటనలు ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి.
ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత మరోసారి ఇలా తోడేళ్లు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు డాక్టర్ వైవీ ఝాలా వెల్లడించారు. అయితే బహ్రైచ్ జిల్లా ప్రజలు ఇప్పటికీ ఇళ్లకు తలుపులు లేకుండా అత్యంత కటిక పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు. ఆకలితో ఉన్న తోడేళ్లకు ఇదే అవకాశం కావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశంలో పచ్చిక బయళ్లలో నివసించే మాంసాహారులైన తోడేళ్లు.. గొర్రెలు, మేకలు, జింకలు, చింకారా, పాములు వంటివి ఆహారంగా తీసుకుంటాయి. అయితే ప్రస్తుతం గడ్డి భూములు కనుమరుగు అవుతున్నందన.. తోడేళ్లు అటవీ ప్రాంతాలను వదిలి పెట్టి జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు.
ఇక తోడేళ్లకు అటవీ ప్రాంతాల్లో ఆహారం దొరక్కపోవడంతో వేటలో భాగంగా గుంపులు గుంపులుగా గ్రామాలపై పడటానికి ఒక కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారం దొరకని సమయాల్లో గ్రామాల్లో ఉన్న చిన్న పిల్లలపై దాడులు చేస్తుంటాయని పేర్కొంటున్నారు. పెద్దలపై దాడి చేస్తే తప్పించుకునే అవకాశాలు ఉంటాయని.. పిల్లలైతే సులభంగా దొరుకుతాయని.. చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకసారి వేటాడిన తోడేళ్లు.. మళ్లీ మళ్లీ దాడి చేసేందుకు ఆసక్తి చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తోడేళ్ల దాడులు పెరుగుతున్న వేళ.. వాటిని నివారించేందుకు శాస్త్రవేత్తలు పలు కీలక సలహాలు ఇస్తున్నారు. గ్రామాల్లో జీవనోపాధిని మెరుగుపర్చడం.. ప్రజలకు కనీస సౌకర్యాలైన విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు వంటివి కల్పించడం ద్వారా పిల్లలపై తోడేళ్ల దాడులను నివారించవచ్చని సూచిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి పూట నిద్రపోయే సమయంలో పిల్లలను ఓ తాడుతో కట్టి.. చేతిలో కట్టుకోండి అంటూ తల్లిదండ్రులకు హితవు పలికారు. ఇలా చేయడం వల్ల తోడేళ్లు దాడి చేసి ఈడ్చుకెళ్తున్నపుడు వెంబడించి కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.