జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి.. అనే సామెత ఆండ్రాయిడ్ కుర్రాళ్లు వినకపోయినా.. నైన్టీస్ బ్యాచ్ అయితే తప్పకుండా వినే ఉంటారు. అంటే ప్రతి నాలుకకూ ఓ డిఫరెంట్ టేస్ట్ ఉన్నట్టే.. ప్రతి మెదడుకూ ఓ సరికొత్త ఆలోచన ఉంటుందన్నమాట. మరి ఈ టేస్టులు.. ఆలోచనల మాటెందుకంటే.. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతి తన డిఫరెంట్ ఆలోచనతో వార్తల్లో నిలిచింది. ఆమె పెళ్లిపత్రిక కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరీ నెట్టింట వైరల్ అయ్యేలా వజ్రాలు పొదిగి మరీ పెళ్లిపత్రిక రూపొందించారా ఏమిటి అని ఆశ్చర్యపోకండి. తన రుచికి, అభిరుచికి, వృత్తికి సరిపోయే విధంగా తన వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయించి ఆహ్వానాలు పంపింది. అయితే ఈ పెళ్లిపత్రికలు అందుకున్న బంధుమిత్రులు మాత్రం.. ఫస్ట్ షాక్ తిన్నారు.. ఆ తర్వాత తేరుకున్నారు.. అనంతరం నవ్వుకున్నారు.. చివరాఖరికి ఆ అమ్మాయి టేస్టును మెచ్చుకున్నారు.
ఇక విషయానికి వస్తే.. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన నార్కెడమిల్లి సతీష్, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూష. వృత్తిరీత్యా టీచర్‌గా పనిచేస్తున్న ఈ యువతికి ఫణీంద్ర అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఆగస్ట్ 23వ తేదీ వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో బంధుమిత్రులందరినీ పెళ్లికి పిలిచే పనిలో పడ్డారు. అయితే టీచర్‌గా పనిచేస్తున్న ప్రత్యూష.. తన వెడ్డింగ్ కార్డు కూడా తన ప్రొఫెషన్‌కు తగినట్లుగా ఉండాలని భావించింది. దీంతో క్వశ్ఛన్ పేపర్ రూపంలో పెళ్లిపత్రిక డిజైన్ చేయించింది. శుభలేఖను ఎనిమిది ప్రశ్నల రూపంలో విభజించి..వాటికి సమాధానం ఇవ్వాలంటూ ఆహ్వానపత్రికలు పంపింది. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్, ట్రూఫాల్స్ ఆన్సర్ క్వశ్చన్స్‌గా వెడ్డింగ్ కార్డు రూపొందించారు.
తనకు కాబోయే వరుడి వివరాలు, వరుడి తల్లిదండ్రుల వివరాలు, తన తల్లిదండ్రుల వివరాలు, కళ్యాణ వేదిక, సుముహూర్తం ఇలాంటి వివరాలను తెలియజేసేలా ప్రశ్నాపత్రం రూపంలో పెళ్లిపత్రిక ప్రింట్ చేయించారు. ఈ ఆహ్వాన పత్రికలు అందుకున్న బంధువులు మొదట షాక్ తిన్నారు. ఆ తర్వాత అమ్మాయి తెలివిని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ క్వశ్చన్ పేపర్ కమ్ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజనం కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వ్యకిగతాన్ని, వృత్తిగతాన్ని ఇలా మిక్స్ చేసిన ఈ అమ్మడు తెలివిని అభినందించాల్సిందే..