వైసీపీ పాలనలో భూదందాలు, సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా జరిగాయని అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఆరోపించారు. అనంతపురం రాం నగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీపై ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో రూ.35,576 కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాల భూముల ఆక్రమణలు జరిగాయని అన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో 10 వేల ఎకరాలు, ఇసుక దందాలో రూ.9,750 కోట్లు దోచుకున్నారని అన్నారు. వైసీపీ హయాంలో తెచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను సీఎం చంద్రబాబు రద్దు చేశారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారని అన్నారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేస్తున్నారని, ఆ కడుపు మంటతో వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చీకొట్టి.. ఘోరంగా ఓడించినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని అన్నారు.