సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తమ టాలెంట్ మొత్తాన్ని రంగరించి.. వీడియోల రూపంలో సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసి.. ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఇలా ఫేమస్ కావాలనే పిచ్చితో చేస్తున్న కొన్ని సంఘటనలు వాళ్ల ప్రాణాల మీదికే తెస్తున్నాయి. మరికొందరు.. ఇతరుల ప్రాణాల మీదికి తెస్తున్నారు. తాజాగా ఓ మహిళపై ప్రాంక్ వీడియోలు చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. ఆమె మూడో ఫ్లోర్ నుంచి పడి అక్కడికక్కడే పడి దుర్మరణం చెందింది. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉండగా.. తల్లి మరణంతో వారిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. సరదాగా ప్రాంక్ వీడియోలు చేద్దాం అనుకున్న ఆ వ్యక్తి.. మహిళ ప్రాణాలు బలిగొన్నాడు.
మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజధాని ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలోని డోంబివాలి ప్రాంతంలో ఉన్న గ్లోబ్ స్టేట్ భవనంలో పనిచేసే ఓ మహిళ.. ప్రాంక్ వీడియో చేస్తుండగా.. భవనంపై నుంచి పడి చనిపోయింది. చనిపోయిన మహిళ.. ఆ బిల్డింగ్‌లోనే పనిచేస్తుండగా.. ఆమెతోపాటు అదే భవనంలో పనిచేసే మరో వ్యక్తి.. సరదాగా ఆమెపై ప్రాంక్ వీడియో చేద్దామని ప్రయత్నించగా.. అది తిప్పికొట్టింది. స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. చనిపోయిన మహిళను నాగినా దేవి మంజీరామ్‌గా గుర్తించారు.
ఈ క్రమంలోనే ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు.. ఆ బిల్డింగ్‌లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందులో రికార్డ్ అయిన వీడియోల ఆధారంగా.. వారు ప్రాంక్ వీడియోలు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఈ సంఘటన ఎలా జరిగిందో వివరించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ భవనంలో నాగినా దేవి మంజీరామ్ క్లీనింగ్ పనులు చేస్తోంది. ఈ క్రమంలోనే అందులోని మూడో అంతస్తులో పనిచేస్తుండగా.. ఆమెతో కలిసి పనిచేసే వారు.. ప్రాంక్ వీడియోలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే నాగినా దేవి మంజీరామ్.. గోడపై కూర్చోవడంతో మరో వ్యక్తి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా పట్టుకోల్పోయి.. పడిపోయింది. ఆమెతోపాటే ఆ వ్యక్తి కూడా పడిపోతుండగా.. అక్కడే ఉన్న మిగితా వాళ్లు పట్టుకోవడంతో ఆగిపోయాడు. ఇక మూడో ఫ్లోర్ నుంచి కింద పడిన నాగినా దేవి మంజీరామ్.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. దీంతో ఆమె కుమార్తె, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.