తొలి ఏకాదశి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. లాడ్లా భాయ్ యోజన కింద అర్హులైన యువకులకు నెలకు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మాఝీ లడ్కీ బహీన్ యోజన కింద బాలికలకు, మహిళలకు నెల నెలా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పురుషులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తొలి ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పండార్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఏక్‌నాథ్ షిండే.. తమ ప్రభుత్వం మహిళలను, పురుషులను సమానంగా చూస్తుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇప్పటివరకు మహిళలకు అమలు అవుతున్న పథకం మాదిరిగానే ఇప్పుడు పురుషులకు కూడా ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అర్హులైన యువకులకు నెల నెలా వారి అకౌంట్లలోకి డబ్బులు వేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు. అయితే వారి వారి అర్హతలను బట్టి.. ఈ చెల్లింపులు ఉంటాయని సంబంధిత అధికారులు చెప్పారు.
ఈ లాడ్లా భాయ్ యోజన కింద.. 12 వ తరగతి పూర్తి చేసిన వారికి నెలకు రూ.6 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో డిప్లొమా పూర్తి చేసిన యువకులకు నెలకు రూ.8 వేలు.. ఇక డిగ్రీ పూర్తి చేసిన యువకుల అకౌంట్లలో నెల నెలా రూ.10 వేలు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం మాత్రమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ శిక్షణ కోసం ఫ్యాక్టరీలలో యువతకు ఏడాది పాటు అప్రెంటిషిప్ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని తీసుకురాలేదని.. నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసేందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు.
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో షిండే శివసేన, బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ.. 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ప్రతిపక్షంలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు కలిపి కూటమిలో ఉన్నాయి. ఇక ఇప్పటికే అర్హులైన మహిళలు, యువతులకు మహారాష్ట్ర ప్రభుత్వం నెల నెలా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది. ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహీన్ యోజన కింద 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 అకౌంట్లలో వేస్తోంది. మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడం, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చి.. వారి కాళ్లపై వారు నిలబడేందుకు తీసుకువచ్చినట్లు ప్రభుత్వ తెలిపింది. ఈ పథకానికి ఏటా రూ.46 వేల కోట్లు అవసరం అవుతాయని ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు.