ధోతీ అనేది మన భారతదేశ సంప్రదాయ దుస్తుల్లో ఒకటి. అయితే ఇప్పుడంటే ట్రెండ్, జనరేషన్ అని.. ఎవరూ ధోతీలు కట్టుకోవట్లేదు కానీ.. మన తాతలు, ఊర్లలో ఉండే కొందరు ఇప్పటికీ ధోతీలు ధరిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా పండగల సమయంలో ధోతీలు, ధోతీల లాంటి ప్యాంట్లు వేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక పొలం పనులు చేసుకునే రైతులు మాత్రం చాలా మంది ఈ ధోతీలను కట్టుకుంటూ ఉంటారు. అయితే ఓ రైతు ధోతీ కట్టుకుని షాపింగ్ మాల్‌కు వెళ్లగా.. లోపలికి వెళ్లకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అదేంటని అడగ్గా.. ధోతీలు ఉన్న వారిని షాపింగ్ మాల్ లోకి అనుమతించమని తేల్చి చెప్పారు. దీంతో ఆ రైతును, అతని కుమారుడిని గేటు వద్దే ఆపేశారు. ఈ ఘటనతో తీవ్ర అవమానంగా భావించిన ఆ రైతు, అతని కొడుకు.. మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరు నగరంలో ఉన్న జీటీ మాల్‌కు ఓ రైతు, అతని కుమారుడితో కలిసి వెళ్లాడు. ఆ జీటీ మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన ఆ అన్నదాతను, వెంట వచ్చిన అతని కుమారుడిని మాల్ సిబ్బంది అడ్డుకున్నారు. ధోతీ ధరించి మాల్ లోపలికి వెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు. ధోతీ కట్టుకుని వచ్చినవారిని లోపలికి పంపించవద్దని మాల్ యాజమాన్యం తమకు ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బంది వెల్లడించారు. కేవలం ప్యాంట్లు ధరించిన వారిని మాత్రమే అనుమతించాలని తమకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో వారిద్దరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటనతో తీవ్ర అవమానంగా భావించిన వారిద్దరూ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి దారి తీయడంతో వారిని అడ్డుకున్న మాల్ సెక్యూరిటీ సిబ్బంది తర్వాత ఆ రైతుకు క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక రైతు ధోతీ కట్టుకుని మాల్‌కు వస్తే తప్పేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అవమానానికి గురి చేసిన ఆ జీటీ మాల్ అధికారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక రైతుకు జరిగిన అన్యాయంపై స్పందించకపోతే వేలాది మంది రైతులతో నిరసనకు దిగుతామని.. రైతు సంఘం నాయకుడు కురుబురు శాంతకుమార్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఇలా దిక్కుమాలిన రూల్స్ పెట్టిన జీటీ మాల్ మేనేజ్‌మెంట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే గతంలో బెంగళూరులోనే రైతును అవమానించిన ఘటనను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం నెత్తిన ఓ సంచి పెట్టుకుని.. బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లిన ఓ రైతును చూసిన అక్కడి సిబ్బంది.. ఆ రైతు దుస్తులు మురికిగా ఉన్నాయని మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బెంగళూరు మెట్రోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు అధికారులు క్షమాపణలు తెలిపారు.
![]() |
![]() |