మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులు హతం అయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం కూడా ఇదే ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు సమాచారం. ఇక మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతంలో భారీగా అత్యాధునిక ఆయుధాలను భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో దాదాపు 12 నుంచి 15 మంది మావోయిస్టులు దాక్కొని ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో భారీ బందోబస్తుతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలోని పోలీసులు ఉదయం 10 గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారి మధ్య మధ్యాహ్నం మొదలైన భీకర కాల్పులు సాయంత్రం వరకు కొనసాగినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య దాదాపు 6 గంటల పాటు కాల్పులు జరగ్గా.. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇక సంఘటనా స్థలంలో 7 ఏకే 47 తుపాకీలతో పాటు పలు హై టెక్నాలజీ కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిపాగడ్ దళం ఇంఛార్జ్ డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు బుల్లెట్ గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం నాగ్‌పుర్ ఆస్పత్రికి తరలించారు.