ఏపీలో రేపటి నుంచి రెండురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. గురువారం, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలకు తోడుగా అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారం కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
అల్ప పీడన ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కూడా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని వెల్లడించింది.
మరోవైపు అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్ల కింద ఉండొద్దని రైతులకు, వ్యవసాయ కూలీలకు సూచించింది. అలాగే భారీ వర్షాలపై అత్యవసర సహాయం కోసం ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1070, 112, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలకు సూచించారు.