కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టులో నీరు అడుగంటి పోవడంతో ప్రాజెక్టు వెలవెల పోతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.95 టీఎంసీ నీరు(గ్రాస్) మాత్రమే ఉంది. మంగళవారం కోడుమూరుకు తాగునీటి అవసరాల కోసం కుడి కాలువ ద్వారా 100 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. అలాగే ఎడమ కాలువ ద్వారా గాజులదిన్నె, హెచ్.కైరవాడి గ్రామాలకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీంతో రోజురోజుకు ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతోంది. ఎగువ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ప్రాజెక్టుకు వరద నీరు రావడం లేదు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.5 టీఎంసీలుగా కాగా ప్రాజెక్టు కింద 25వేల ఎకరాలు సాగు భూమి ఉంది. రెండేళ్లుగా జూన్ చివరి నాటికి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి సమృద్ధిగా చేరేది. ఈ ఏడాది జూలై నెల సగం రోజులు గడిచినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రాజెక్టుకు నీరు చేరలేదు.