ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 03:48 PM

ఏపీలో రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై వివాహేతర సంబంధం ఆరోపణలు గట్టిగానే కాకరేపుతున్నాయి. దీనిపై ప్రెస్ మీట్ ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఆయన..చివరకు కొత్త ఛానెల్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడో తీసుకున్నారు. అప్పట్లో జగన్ బ్రేక్ వెయ్యడంతో, వెనక్కి తగ్గారు. ఇప్పుడు తగ్గేదే లేదు అంటున్నారు. అందువల్ల త్వరలోనే ఓ కొత్త వార్తా ఛానెల్ రాబోతోంది అని మనం అనుకోవచ్చు. మరి ఆయన ప్రెస్‌మీట్‌లో ఇంకా ఏం చెప్పారో చూద్దాం."నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చి ఎవరో బెదిరించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే వ్యక్తిని కాను. నా పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎవరైతే ఇప్పుడు తొక ఆడిస్తున్నారో త్వరలోనే వాటిని కత్తిరిస్తా. వైసీపీకి సహకరించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు. వైసీపీకి మద్దతిచ్చిన కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి పోతున్నాయి. నెలరోజుల పాలనను ప్రజలు గమనిస్తున్నారు" అని విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్‌లో అన్నారు.


 


"వైసీపీ నేతలపై బురదజల్లుతున్నారు. చివరికి మా పార్టీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై నాపై అనేక ఆరోపణలు చేశారు. నా వ్యక్తిత్వం ఏంటి అన్న విషయం నాకు తెలుసు. రామోజీ రావు లాంటి వ్యక్తులను సైతం ఎదురించాను. సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వారిని వదిలిపెట్టను. చట్టరీత్య చర్యలు తీసుకుంటాను" అని ఎంపీ హెచ్చరించారు."త్వరలోనే నేను కొత్త ఛానెల్ ప్రారంభిస్తున్నా. గతంలో మా అధ్యక్షులు నిర్ణయం మేరకు ఛానెల్ ప్రారంభాన్ని వెన్నక్కి తీసుకున్నా. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా తగ్గేది లేదు. కుల ఛానెల్స్, కుల పత్రికలను ఎండగడతాను. కులాలకు మతాలకు అతీతంగా ఈ ఛానెల్ ఉంటుంది. ఒక పార్టీకి మాత్రమే పనిచేయడం కాకుండా న్యూట్రల్‌గా ఉంటుంది" అని విజయసాయి రెడ్డి అన్నారు.


 


శాంతి విషయంలో..:


 


"పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతోంది. సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా? నిజనిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నాపై వార్తలు రాస్తున్నారు. మా పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అంటూ.. విజయవాడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూపై విజయసాయి రెడ్డి మాట్లాడారు.


 


"మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారు. నా పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టం. దుష్ప్రచారం చేస్తున్నవారు మా పార్టీవాళ్లైనా వదలను. చట్టపరంగా ముందుకువెళతాం. మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తాం. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు" అని విజయసాయిరెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com