ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మంత్రిని ట్విట్టర్‌లో బ్లాక్ చేసిన కేటీఆర్.. ప్రియ మిత్రులు, ఒకరికొకరు ఓదార్పులని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 09:26 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్‌సీపీ ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందంటూ కేటీఆర్ కామెంట్స్ చేయడంపై ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. తెలంగాణ మాజీ మంత్రికి కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ వైఎస్సార్‌సీపీ ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై చేసిన కామెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. 'ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు.. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరం లో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి' అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్కు, కొడుకు కలెక్షన్ హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాళ్ల కింద పడేసి తొక్కినా, సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో తమ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుందని కౌంటర్ ఇచ్చారు.


పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారని తీవ్రంగా స్పందించారు. జగన్ వంటి నియంత చేతిలో ఆంధ్రప్రదేశ్ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజలు తెలంగాణలో ముందుగానే గుణపాఠం చెప్పారని.. తమ నాయకుడు చంద్రబాబుని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే బీఆర్ఎస్ కొంప ముంచిందని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు.


ఆంధ్రప్రదేశ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు తమ అనుకున్నదానికి అతీతంగా జరిగాయన్నారు కేటీఆర్. ఏపీలో పేదలకు జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారని.. అందుకే ఆయనవైపు ప్రజలు మొగ్గు చూపుతారని తమకు సమాచారం వచ్చిందన్నారు.అదే విషయాన్ని తాము చెప్పామని..కానీ ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపు వెళ్లిందని.. టీడీపీ, జనసేన, బీజేపీలు వేర్వేరుగా పోటీచేసి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవన్నారు. తన మిత్రుడు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రోజూ ప్రజల్లో ఉండేవారని.. అయినా ఓడిపోవడం ఆశ్చర్యంగాఉందన్నారు. ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడంవల్ల ఓడిపోయారని చెప్పుకోవడానికి వీల్లేదని.. ఎన్నికల ఫలితాలకు.. అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధం లేదని అర్థమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు పనైపోయిందన్నారు.. ఇప్పుడు ఆయన మళ్లీ గెలిచారని గుర్తు చేశారు కేటీఆర్. ఢిల్లీలో ఎక్కడచూసినా ఆయన పోస్టర్లే కనిపిస్తున్నాయని.. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల మధ్య సమావేశాన్ని ముఖ్యమంత్రుల మధ్య జరిగిందనే చూడాలని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నారని.. తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణకు మేలు జరగడంలో చంద్రబాబు పాత్ర ఉంటే స్వాగతిస్తామన్నారు. తాము బీఆర్ఎస్‌ను ఏపీలో పెట్టినప్పుడు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామనడంలో తప్పులేదన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com