ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి భూముల ధరలు.. ఆరు నెలల్లోనే అంతగా పెరుగుతాయా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 16, 2024, 04:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ జోష్ కనిపిస్తోంది. ఐదేళ్లపాటు స్తబ్దుగా ఉండిపోయిన భూముల ధరకు ఇప్పుడు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో అమరావతి పునర్వైభవం దిశగా మళ్లీ అడుగులు పడటం మొదలైంది.


కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ఇప్పటికే 8 టెండర్లకు నోటిఫై చేసింది. మంత్రులు, ఉన్నతాధికారుల రాకపోకలతో ఈ ప్రాంతం సందడిగా మారింది. చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు అమరావతి ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.


2024 ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారనే అంచనాలతో రెండు నెలల కిందటి నుంచే అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరగడం మొదలైందని క్రెడాయ్ ఏపీ విభాగం అధ్యక్షులు వైవీ రమణా రావు తెలిపారు. క్రెడాయ్ అంచనాల ప్రకారం అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ భూములు కలుపుకొని మొత్తం 50 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. గతంలో చదరపు గజం రూ.15 వేలు పలికిన భూమి ధర.. ఇప్పుడు రూ.25 వేలు పలుకుతోంది. 2014-19 మధ్య బాబు సీఎంగా ఉన్న సమయంలో ఉన్న అమరావతి భూముల ధరలకు ప్రస్తుత ధరలు చేరుకున్నాయి.


‘అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం మొదలైంది. ఇక్కడ భూముల ధరలు ఏటేటా పెరగబోతున్నాయి. వచ్చే 18 నెలల్లో భూముల ధరలు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నాం’ అని క్రెడాయ్ ఏపీ విభాగం ప్రెసిడెంట్ రమణా రావు పీఐటీకి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడం మొదలుపెట్టిందని.. ఇందులో 80 శాతం పనులు పూర్తయిన అధికారులు, లెజిస్లెచర్లు, జడ్జిల నివాస సముదాయాలు ఉన్నాయని రమణారావు తెలిపారు. ఏడాది తిరిగే సరికి ఈ ప్రాంతం అందంగా మారిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.


రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరిస్తే.. ప్రయివేట్ పెట్టుబడులు, అభివృద్ధికి ద్వారాలు తెరుచుకుంటాయి. దీంతో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. 2029 ఎన్నికల్లోనూ చంద్రబాబు విజయం సాధిస్తే.. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్‌కు తిరుగు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


2025 జనవరి నుంచి అమరావతి ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయని.. ధరలు మూడింతలు పెరిగి బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడతాయని.. జనం కూడా ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపుతారని.. అందులో ఎలాంటి అనుమానం లేదని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 30 నెలల్లో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ ప్రకటనతో దేశ విదేశాల్లో స్థిరపడిన ఏపీ ప్రజల చూపు అమరావతిపై పడుతుంది అనడంలో సందేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com