ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చార్ ధామ్ యాత్రికులకు అలర్ట్.. ఈ నెల 31 వరకు వారికి దర్శనాలు బంద్

national |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 09:57 PM

ఉత్తరాఖండ్‌లోని మంచు కొండల్లో జరుగుతున్న చార్ ధామ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు.. ఉత్తరాఖండ్ బాట పడుతున్నారు. దీంతో చార్ ధామ్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలైన్లు నిలిచిపోయి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చార్ ధామ్ క్షేత్రాలను సందర్శించుకునేందుకు 26 లక్షలకుపైగా యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈసారి చార్ ధామ్ యాత్ర మే 10 వ తేదీన ప్రారంభం అయింది. తొలి రోజు నుంచే నిత్యం వేల సంఖ్యలు యాత్రికులు పోటెత్తడంతో వారికి దర్శనాలు కల్పించడం అధికారులకు తీవ్ర సమస్యగా మారింది. ఈ క్రమంలోనే వీఐపీ దర్శనాల రద్దును మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సర్కార్ వెల్లడించింది.


చార్‌ధామ్‌ యాత్రకు భక్తులు పోటెత్తడంతో ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్‌ ధామ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే చార్ ధామ్ క్షేత్రాల సందర్శనకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. మరోవైపు.. ఇప్పటికే తొలి 15 రోజులు అంటే ఈ నెల 25 వరకు వీఐపీలకు దర్శనాలు రద్దు చేయగా.. తాజాగా దాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి మొదటి నుంచి భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో మే 31 వ తేదీ వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన లేఖలో ఉత్తరాఖండ్ సీఎస్ తెలిపారు.


చార్ ధామ్ యాత్రకు వెళ్లాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. https://registrationandtouristcare.uk.gov.in/ అనే వెబ్‌సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజున చార్ ధామ్ క్షేత్రాల దర్శనం చేసుకోవాలని చూస్తున్నారో ఆ రోజున చేసుకోవచ్చని తెలిపింది. ఇక వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు యాత్రకు ముందే మెడికల్ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.


ఈసారి చార్ ధామ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా 26 లక్షలకు పైగా యాత్రికులు రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఈసారి మరింత భారీగానే ఉంటుందని అంచనా వేశారు. చార్ ధామ్ యాత్రలో మొదట యమునోత్రిని దర్శించుకుని.. ఆ తర్వాత గంగోత్రి, కేదార్‌నాథ్ క్షేత్రాలను సందర్శించి.. చివరికి బద్రీనాథ్ చేరుకుంటారు. ఈ చార్ ధామ్ యాత్రకు రోడ్డు మార్గం, హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈసారి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన వారం రోజుల్లోనే ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గతం కంటే ఈ ఏడాది యాత్రికులు అధికంగా చార్ ధామ్ యాత్రకు పోటెత్తుతున్నారని చెప్పారు. అందుకే రిజిస్ట్రేషన్‌ చేయించుకోని భక్తులను యాత్రకు అస్సలు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com