ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సంచలన నిర్ణయం.. టీడీపీ నుంచి ఆరుగురు ముఖ్య నేతలు సస్పెండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 08:06 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పలేదు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి ఈ తలనొప్పి ఎక్కువగా ఉంది. పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.. నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో టీడీపీ ఆరుగురు నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటనను విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఆరుగురు నేతలపై సస్పెన్షన్‌ వేటు పడింది.


సివేరి అబ్రహం (అరకు నియోజకవర్గం), మీసాల గీత (విజయనగరం నియోజకవర్గం), పరమట శ్యాంసుందర్‌ (అమలాపురం నియోజకవర్గం), ముడియం సూర్యచంద్రరావు (పోలవరం నియోజకవర్గం), వేటుకూరి వెంకట శివరామరాజు (ఉండి నియోజకవర్గం), జడ్డా రాజశేఖర్‌ (సత్యవేడు నియోజకవర్గం)ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధిష్టానం సిటీ ఇవ్వకపోవడంతో ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో ఆయా అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు పడింది.


తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. నియోజకవర్గాలవారీగా ఎన్నికలకు సమన్వయకర్తలుగా నియమించారు. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎన్నికల సమన్వయకర్తగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పార్టీ నియమించింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని నియమిస్తూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రాలయానికి పాలకుర్తి తిక్కారెడ్డి, వెంకటగిరికి వూకా విజయ్‌కుమార్‌, మదనపల్లికి చమర్తి సురేష్‌రాజు, మడకశిరకు గుండుమల తిప్పేస్వామి, రంపచోడవరానికి వంతల రాజేశ్వరి, ప్రొద్దుటూరుకు చదిపిరాళ్ల శివనాథరెడ్డి, పుంగనూరుకు మన్నె సుబ్బారెడ్డి, నంద్యాలకు ఏరాసు ప్రతాపరెడ్డి, మార్కాపురానికి మాగుంట రాఘవరెడ్డి, పాడేరుకు బుద్దా నాగజగదీష్‌, పాణ్యంకు మల్లెల రాజశేఖర్‌, రాప్తాడుకు గోనుగుంట్ల విజయ్‌కుమార్‌లను ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించారు. చీపురుపల్లికి గద్దె బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజును, రాజంపేటకు జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చమర్తి జగన్మోహన్‌రాజు, పోలి సుబ్బారెడ్డిని సమన్వయకర్తలుగా నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నందికొట్కూరులో కలిశారు. నూజివీడు నుండి రెబల్ అభ్యర్థిగా పోటీకి దిగిన వెంకటేశ్వరరావు గారు నేడు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు డోన్‌ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటన సమయంలో భద్రతా వైఫల్యం కనిపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com