ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెట్లను హగ్ చేసుకుంటే రూ.1500 చెల్లించాలి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

national |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 09:11 PM

ప్రకృతి ప్రేమికులు చాలా మంది ఉంటారు. ఇక చెట్లను రక్షించేవారు, వాటిని ప్రేమించేవారు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఈ కంపెనీ మాత్రం అందులో ఇంకాస్త వెరైటీ అన్నమాట. ఎందుకంటే చెట్లను కౌగిలించుకుంటే రూ.1500 వసూలు చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న కబ్బన్ పార్కులో ఈ నెల 28 వ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేవారికి మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు చెట్లను హగ్ చేసుకోవడం, అడవిలో నడవడం వంటి రకరకాల కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ బాధ్యతలను ట్రోవ్ ఎక్స్‌పీరియెన్సెస్ అనే కంపెనీ.. ఫారెస్ట్ బాతింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రూ.1500 చెల్లించాలని కండీషన్ కూడా పెట్టింది. అయితే ఈ ప్రకటనను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


బెంగళూరుకు చెందిన ట్రోవ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ అనే కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఏప్రిల్‌ 28 వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు ఈ ఫారెస్ట్‌ బాతింగ్‌ అనే కార్యక్రమం జరగనుంది. బెంగళూరు నగరంలోని కర్ణాటక హైకోర్టు పక్కనే ఉన్న కబ్బన్ పార్కులో ఈ ఫారెస్ట్ బాతింగ్ చేపట్టనున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ ఫారెస్ట్ బాతింగ్‌లో భాగంగా చెట్లను హగ్ చేసుకోవడం, పార్క్‌లోని అడవిలో నడవడం వంటి కార్యక్రమాలు ఉంటాయనిత తెలిపింది. ఇలా చేయడం వల్ల రోజూ ఉరుకులు, పరుగుల జీవితంలో సతమతం అయ్యేవారికి మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ట్రోవ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ కంపెనీ వెల్లడించింది.


చెట్లను హగ్ చేసుకుంటే రూ.1500


అయితే ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రకటనను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మార్కెట్‌లోకి కొత్త స్కామ్‌ వచ్చిందని మండిపడుతున్నారు. చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1,500 ఏంటి అంటూ కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్న ధనవంతులను ఇలాంటి స్కామ్‌లలో పడేందుకు మద్దతు ఇవ్వాలని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక రాష్ట్ర హైకోర్టు పక్కనే ఇలా జరగడం ఐసింగ్‌ ఆన్‌ ది కేక్‌ అని మరొకరు కామెంట్ చేశారు.


ఇక బెంగళూరులోని టెక్ ఉద్యోగులు.. వారానికి 5 గంటలు మాత్రమే పని చేస్తూ.. దేశంలోని 95 శాతం మంది కంటే మెరుగ్గా జీవిస్తున్నారనే భ్రమలో బతుకుతున్నారని తెలిపారు. ఆధ్యాత్మికత, ప్రకృతితో మమేకం అయి మంచి అనుభూతిని పొందేందుకు డబ్బులతో కొనేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను సాధ్యమైన అన్ని మార్గాల్లో మోసం చేయవచ్చని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక మరికొందరు ఈ ప్రకటనను సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టారు. చెట్లను హగ్ చేసుకోవడానికి రూ. 1500 ఎక్కువ కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నానని.. తప్పకుండా వెళ్తానని మరొకరు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com