ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆరోజు సెలవు.. ఉత్తర్వులు వచ్చేశాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 07:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అందుకే మే 13న (సోమవారం) సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పోలింగ్ రోజున సెలవు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మే 13న (సోమవారం) వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఫ్యాక్టరీలు, షాపులు, సముదాయాల చట్టాల కింద సెలవు ప్రకటిస్తారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.


ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లుపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కెఎస్. జవహర్ రెడ్డి, డీజీపీ కేవి.రాజేంద్రనాధ్ రెడ్డి, సీఈవో ముకేశ్ కుమార్ మీనాలు సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యునికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో డీజీపీ, సీఈవోతో పాటు వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు హాజరయ్యారు.


రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు సీఎస్. ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 46,165 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. వెబ్‌ కాస్టింగ్‌ ఉన్న కేంద్రాలు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానమై ఉంటాయని, వాటిలో పోలింగ్‌ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు.


ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు సహా 121 చెక్‌ పోస్టులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. డీజీపీ కేవీ రాజేంద్రనాధ్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు 1.50 లక్షల మంది రాష్ట్ర పోలీసులు, 522 కంపెనీల స్టేట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు, 465 కంపెనీల సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి హోంగార్డు తదితర స్థాయి పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు.


రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఎన్నికల సన్నద్దతపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో 4,09,41,182 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి 12,683 వాహనాలు, పోలింగ్‌ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరమని చెప్పారు. 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 829 మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్‌ ఎఆర్‌ఓలు, 5,067 మంది సెక్టోరల్‌ అధికారులు, 5,067 మంది సెక్టోరల్‌ పోలీస్‌ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 2,48,814 మంది పోలింగ్‌ అధికారులు, 46,165 బూత్‌ స్థాయి అధికారులు, 416 మంది జిల్లా స్థాయి నోడల్‌ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించామన్నారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గాల పరిధిలో మోడల్‌ కోడ్‌ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com