ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో తాగునీటికి కటకట.. రోడ్లపైనే టెకీలు పడిగాపులు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 10:48 PM

గార్డెన్ సిటీ బెంగళూరు నగరంలో నెలకున్న నీటి సంక్షోభం ఐటీ ఉద్యోగులపై తీవ్రప్రభావం చూపుతోంది. నీళ్లులేక రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి. తాజాగా, దాహం తీర్చుకోడానికి నీటి క్యాన్లు చేతపట్టుకుని గంటల తరబడి ఆర్‌ఓ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. తాగడానికి నీళ్లు తెచ్చుకోడానికే టైం సరిపోతుందని, ఆఫీసులకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని నీటి కష్టాలు ప్రముఖ ఐటీ కంపెనీలపై పడింది. ఆ సంస్థల్లో పనిచేసే టెకీలు దాహం కేకలు, బాధలు, వ్యథలను సోషల్ మీడియాలో తమ స్నేహితులతో పంచుకుని వాపోతున్నారు.


వివిధ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి అనుమతించక తప్పడం లేదు. ఇంటి నుంచి పనికి అనుమతించడంతో కొందరు టెక్కీలు సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక, నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్‌ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇళ్లలో వంటచేస్తే పాత్రలను కడిగేందుకు నీళ్లు అవసరం కావడంతో ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్ల నుంచి పార్శిళ్లపై ఆధారపడుతున్నారు. పేపర్ ప్లేట్‌లు, టీ కప్పులు, గ్లాసులను వినియోగిస్తున్నారు. బయట నుంచి ఆహారం తెప్పించుకుంటున్నా తాగడానికి నీళ్లకోసం కూడా యుద్ధమే చేస్తున్నారు.


క్యాన్లను పట్టుకుని ఎక్కువ మంది టెక్కీలు ఉదయాన్నే ఆర్వో ప్లాంట్ల వద్ద పడిగాపులు కాస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. అనేక అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నీటి రేషన్‌ వ్యవస్థ అమలులోకి వచ్చింది. నిర్దేశిత పరిమాణంలో నీటిని వినియోగించాలి. ఎక్కువగా వాడితే జరిమానా విధిస్తున్నారు. కొన్ని కుటుంబాలు నీళ్ల కోసం రోజుకు రూ.500 వరకు ఖర్చుచేయక తప్పడం లేదు.


బెంగళూరులో నీటి సంక్షోభం నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పూర్తిగా ట్యాంకర్‌ మాఫీయాకు లొంగిపోయారని బీజేపీ నేత ఆర్‌.అశోక్‌ విమర్శించారు. గడువు పూర్తయినా ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేదని ధ్వజమెత్తారు. నీటి సరఫరా కోసం ప్రైవేట్‌ ట్యాంకర్ల యజమానులు పేర్లు నమోదు చేసుకోలేదని, నమోదు చేసుకున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.


కాగా, బెంగళూరు నగరానికి రోజూ 2,600 ఎంఎల్డీలు అవసరం కాగా.. ప్రస్తుతం 2,100 ఎంఎల్డీలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 500 ఎంఎల్డీలు లోటు ఉంది. తాగునీటి సమస్యను నివారించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కావేరీ, కాంబినీలో జలాలు జూన్ వరకూ సరిపోతాయని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com