తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌పై ఆ పార్టీ నేత సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని.. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ కామెంట్స్ చేశారు. తిరుపతిలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి టీడీపీ ఇంచార్జి సుగుణమ్మ కీలక తీర్మానం చేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఆరని శ్రీనివాసులును జనసేన - టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని తమకు టీడీపీ అధిష్టానం అధికారికంగా ఇంకా చెప్పలేదని అన్నారు. కూటమిలో ఏ పార్టీ అయినా, అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తామని.. గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థి స్థానికులై ఉండాలన్నారు. తిరుపతి జనసేన నేతలు కూడా స్థానికేతరులు వద్దు అని అంటున్నారని తెలిపారు. అవసరమైతే జనసేన తరఫున తాను పోటీ చేస్తానని సుగుణమ్మ సంచలన ప్రకటన చేశారు. కాగా.. ఓ వైపు తిరుపతి ఎమ్మెల్యే తానే అని.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ తన వెంటనే ఉన్నారని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరణి శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు. మరోవైపు జనసేన అభ్యర్థిగా పోటీకి సై అని సుగుణమ్మ ప్రకటన కూటమిలో చర్చకు దారి తీసింది. తిరుపతి టీడీపీ నేతల తీర్మానంపై అధినేత చంద్రబాబు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి మరి.