ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా అంటే ఒక దేశం కాదు.. డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 11:04 PM

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఏంకే పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు.. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీకి చెందిన ఎంపీ ఏ రాజా మరో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇండియా అంటే ఒక దేశం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా శ్రీరాముడిపై, రామాయణంపై ఏ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఎంపీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వంపై ఏ రాజా చేసిన ప్రసంగం తాజా వివాదానికి కేంద్ర బిందువు అయింది. దేశం అంటే ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష ఉండాలని పేర్కొన్న ఏ రాజా.. భారత్‌లో అలా లేదని.. అందుకే భారత్‌ ఒక దేశం కాదని తెలిపారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని సూచించారు. భారతదేశం ఒక దేశం కాదని.. ఒక ఉపఖండమని పేర్కొన్నారు. ఎందుకంటే తమిళం ఒక దేశమని.. మలయాళం అనేది ఒక భాష ఒక దేశమని.. ఒరియా ఒక భాష అని అది ఒక దేశమని తెలిపారు. ఇవన్నీ కలిపి ఇండియా ఏర్పడిందని.. అలాంటప్పుడు ఇండియా దేశం కాదని.. ఒక ఉపఖండమని వెల్లడించారు.


భారత దేశంలో ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయని.. మీరు తమిళనాడుకు వెళ్తే అక్కడ ఒక సంస్కృతి ఉంటుందని.. పక్కనే ఉన్ కేరళకు వెళ్తే మరో సంస్కృతి ఉంటుందని.. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తే అక్కడ ఒక సంస్కృతి ఉంటుందని.. ఒరియాకు వెళ్తే వారి సంస్కృతి వేరే ఉంటుందని చెప్పారు. ఆర్ఎస్ భారతి చెప్పినట్టు మణిపూర్‌లో కుక్క మాంసం తింటారని.. అది వారి సంస్కృతి అని.. అందులో ఏమీ తప్పు లేదని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్విటర్‌లో షేర్ చేశారు. మన ఇళ్లలో వంటగది, టాయిలెట్లకు ఒకే ట్యాంకర్ నుంచి నీళ్లు వస్తాయని.. అంతమాత్రాన టాయిలెట్‌లో వచ్చే నీళ్లను వంటగదిలో ఉపయోగించరని పేర్కొన్నారు.


ఇక తాము రాముడికి శత్రువులమని.. ఏ రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు రాముడి పైనా.. రామాయణం పైనా విశ్వాసం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే రామాయణంపై, రాముడిపై ఏ రాజా చేసిన వ్యాఖ్యలపై అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏ రాజా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారతదేశ ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను బహిరంగంగా కించపరచడం వంటివి క్షమించరాని నేరాలని.. ఇలాంటి వ్యాఖ్యలను దేశంలో ఎవరూ అంగీకరించరని.. వెంటనే ఏ రాజాను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com