ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన వెంటనే ‘కశ్మీర్‌’‌పై విషం గక్కిన షెహబాజ్

international |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 10:17 PM

దాయాది పాకిస్థాన్‌లో ఎన్నికల పూర్తయి దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్-ఎన్) నేత, నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. పార్లమెంటులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనల మధ్య ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఆయన సులువుగా విజయం సాధించారు. మొత్తం 336 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఆయనకు 201 ఓట్లు రాగా.. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అభ్యర్థి ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌ 92‌కు ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీకి అవసరమైన సంఖ్య కంటే షెహబాజ్‌కు 32 ఓట్లు అధికంగా వచ్చాయి.


పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) మద్దతుతో పీఎంఎల్-ఎన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఓటింగ్ అనంతరం పాక్ 24వ ప్రధానిగా షెహబాజ్‌ను స్పీకర్‌ సర్దార్‌ అయాజ్‌ సాదిక్‌ ప్రకటించారు. అధ్యక్ష భవనంలో సోమవారం షెహబాజ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపడతారు. ఇమ్రాన్ రాజీనామా తర్వాత 2022 ఏప్రిల్‌ నుంచి 2023 ఆగస్టు వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. మరోవైపు, పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. తమ నేతకు స్వేచ్ఛ కల్పించాలని ఇమ్రాన్ మద్దతుదారులు డిమాండు చేస్తూ నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా, నవాజ్‌ షరీఫ్‌కు మద్దతుగా అధికారపక్ష సభ్యులు నినదించారు.


ప్రధానిగా ఎన్నికైన తర్వాత ప్రసంగించిన షెహబాజ్‌. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి తన వక్రబుద్దిని చాటుకున్నారు. కశ్మీర్‌ సమస్యను పాలస్తీనాతో పోల్చిన ఆయన.. స్వేచ్ఛ కల్పించేందుకు జాతీయ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయాలనే నిర్ణయాన్ని భారత్ ఉపసంహరించుకోవచ్చని షెహబాజ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అటు పొరుగు దేశాలు సహా అన్ని కీలక దేశాలతో సత్సంబంధాలను నెరుపుతామని చెబుతూనే.. కశ్మీర్‌పై అక్కసు వెళ్లగక్కారు.


తమ ప్రభుత్వం స్నేహితులను పెంచుకుంటుందని, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలే అతి పెద్ద సవాలని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి అతి పెద్ద శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, 2030కల్లా జీ20 సభ్యత్వాన్ని సాధిస్తామని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాక్ నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే బదులు ఈ ప్రాంతంలో ఉగ్రవాద రహిత వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక, అవినీతి ఆరోపణలు, పలు కేసులను ఎదుర్కొని విదేశాలకు పారిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గత ఏడాది అక్టోబరులో ప్రవాసం నుంచి తిరిగొచ్చారు. నాలుగోసారి ప్రధాని కావాలనుకుని ఎన్నికల ఆయన బరిలో దిగారు. అయితే తన పార్టీకి అవసరమైన మద్దతు రాకపోవడంతో సోదరుడ్ని ప్రధానిని చేయాల్సి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com