ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతిపై సుప్రీం చరిత్రాత్మక తీర్పు వెనుక 98 నాటి పీవీ కేసు ఏంటి?

national |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 09:54 PM

అవినీతి కేసుల్లో విచారణ విషయంలో ప్రజాప్రతినిధులకు ఎటువంటి మినహాయింపు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అవినీతి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ కల్పించబోదని పేర్కొంటూ 1998 నాటి పీవీ నరసింహారావు కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, 194లకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. ‘మేము వివాదానికి సంబంధించిన అన్ని అంశాలపై స్వతంత్రంగా తీర్పు ఇచ్చాం... అవినీతి విషయంలో పార్లమెంటేరియన్లు మినహాయింపు పొందుతున్నారా? మేము ఈ అంశంలో విభేదిస్తున్నాం’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.


ఏంటీ పీవీ కేసు?


అయితే, ఇంతకీ మాజీ ప్రధాని పీవీ కేసు ఏంటి? అవినీతితో సంబంధం ఏంటి? అనేది ప్రస్తుతం చర్చకు తెరతీసింది. పీవీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో పలువురు ఎంపీలకు డబ్బులను ఎరగా వేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 1991 సాధారణ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి పీవీ నరసింహారావు నాయకత్వం వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులోని పెరంబదూర్‌లో హత్యకు గురయ్యారు. ఆ సానుభూతి కాంగ్రెస్‌కు కొంత కలిసొచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన సాధారణ మెజార్టీ (272) సాధించలేకపోయింది. ఆ పార్టీ 232 సీట్లలలో విజయం సాధించింది.


మైనార్టీ ప్రభుత్వ ఐదేళ్ల పదవీకాలం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇందులో ప్రధానమైంది దేశ ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రేరేపించిన ఆర్థిక సంక్షోభం, 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ తర్వాత జరిగిన మత హింసకు సంబంధించి కూడా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంది. దీంతో 1993 జులైలో పీవీ సర్కారుపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆ సమయానికి కాంగ్రెస్ కూటమికి సంఖ్యాబలం 251 ఉండగా.. ఇతర పార్టీల బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయి. ఆ పార్టీకి సాధారణ మెజారిటీకి కనీసం డజను తక్కువైంది. కానీ, అవిశ్వాసంపై ఓటింగ్ జరగ్గా ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కువ ఓట్లు రావడంతో పీవీ గట్టెక్కారు.


జేఎంఎం ఎంపీలపై ఆరోపణ


అయితే, ఏడాది తర్వాత మాజీ సీఎం శిబూ సోరెన్‌తో సహా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన ఆరుగురు ఎంపీలు ప్రభుత్వానికి ఓటు వేయడానికి లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ, ఆ సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, 94 కింద న్యాయస్థానం చట్టసభ సభ్యుల ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.


ఈ నేపథ్యంలో 2012 రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ (శిబు సోరెన్ కోడలు) 1998 కేసును ఉటంకిస్తూ మినహాయింపును పొందారు. దీనిపై ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం సుదీర్ఘ విచారణల తర్వాత తాజాగా తీర్పు చెప్పింది. ప్రజా ప్రతినిధులు అవినీతి, లంచం కేసుల్లో రక్షణ పొందలేరని ఉన్నత న్యాయస్థానం తుది తీర్పులో పేర్కొంది.


రాజ్యాంగ ధర్మాసనం తీర్పు


‘పార్లమెంటరీ అధికారాల ద్వారా అవినీతికి రక్ణణ కల్పించదని మేము భావిస్తున్నాం... అవినీతి, చట్టసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుంది. రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులు’ అని కోర్టు పేర్కొంది. పీవీ నరసింహరావు తీర్పు ఫలితంగా లంచం తీసుకుని తదనుగుణంగా ఓటు వేసే ప్రజాప్రతినిధికి రక్షణ ఉంటుంది, అయితే లంచం తీసుకున్నప్పటికీ స్వతంత్రంగా ఓటు వేసిన చట్టసభ్యుడ్ని ప్రాసిక్యూట్ చేసే విరుద్ధమైన పరిస్థితి ఏర్పడింది’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com