ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోర్లాగ్ సృష్టించిన వంగడాలతో భారత్‌లో ప్రయోగాలు,,,,దేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేసిన హరితవిప్లవం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 08:43 PM

భారతదేశ శాస్త్రీయ పురోగతిలో చంద్రుడిపై ల్యాండింగ్ కలికితురాయి.. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన హరిత విప్లవం అద్బుత విజయంగా చెప్పుకోవాలి. 1965 నాటికి 50 కోట్లకుపైగా జనాభా ఉంటే.. గోధుమ ఉత్పత్తి కేవలం 12 మిలియన్ టన్నులు మాత్రమే. స్వాతంత్య్ర సమయానికి దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. విదేశాల నుంచి సరకు వస్తేగానీ పొట్టగడవని పరిస్థితి. అమెరికా నుంచి గోధుమలను భారీగా దిగుమతి చేసుకునేవాళ్లం. 1960ల ఆరంభంలోనూ దేశంలో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే.


వరి, గోధుమ తదితర పంటలపై ఎంఎస్ స్వామినాథన్‌ విశేష కృషితో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. దిగుమతి చేసుకునే పరిస్థితి మారి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. భారతావని పండించే బియ్యంపై సగం ప్రపంచం ఆధారపడి ఉందంటే హరిత విప్లవం తెచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి దశాబ్దాలలో గోధుమ ఉత్పత్తి దాదాపు 10 రెట్లు పెరిగి 112 మిలియన్ టన్నులకు చేరుకుంది. దిగుబడిలో ఈ పెరుగుదల, ఆహార కొరతను నివారించింది. అగ్రికల్చర్‌లో డిగ్రీ, సైటోజెనెటిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన M S స్వామినాథన్.. సివిల్స్‌లో ఉత్తీర్ణులై ఐపీఎస్‌కు ఎంపికైనా వదులుకున్నారు. జెనెటిక్స్‌లో యునెస్కో ఫెలోషిప్ కోసం ఐరోపాలోని నెదర్లాండ్‌ వెళ్లారు. అక్కడ బంగాళాదుంప జన్యు పరిణామంపై పరిశోధన చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ చేశారు.


స్వామినాథన్‌ ఉత్సాహం, ప్రతిభను చూసిన విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ అక్కడే మంచి జీతంపై అధ్యాపక పోస్టు ఆఫర్‌ చేశారు. నేనిక్కడికి నేర్చుకోవటం కోసమే వచ్చానని, తిరిగి వెళ్లి నా దేశానికి సేవ చేయాల్సి ఉందని స్వామినాథన్ సున్నితంగా తిరస్కరించారు. తిరిగి స్వదేశానికి వచ్చి.. 1954లో కటక్‌లోని ‘కేంద్ర వరి పరిశోధన సంస్థ’లో చేరి, తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థకు మారారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ భారత వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించేందుకు నడుం బిగించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాల కోసం పరిశోధన మొదలుపెట్టారు. ఈ క్రమంలో అమెరికన్‌ వ్యవసాయ శాస్త్రవేత్త ఒర్‌విలె వోగెల్‌‌తో స్వామినాథన్‌కు పరిచయమైంది. ఆయన అప్పటికే ఓ కొత్తరకం గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేశారు. కానీ తన వంగడం భారత వాతావరణానికి అనుకూలం కాదని, నార్మన్‌ బోర్లాగ్‌ను సంప్రదించాలని స్వామినాథన్‌కు ఆయనసలహా ఇచ్చారు.


అప్పటికే మెక్సికోలో ఇలాంటి గోధుమ వంగడాలనే నార్మన్ బోర్లాగ్ రూపొందించారు. అవి భారత వాతావరణానికి కూడా సరిపోయేలా ఉండటంతో బోర్లాగ్‌ను స్వామినాథన్‌ కలిసి పరిస్థితి వివరించారు. బోర్లాగ్‌ తాము తయారు చేసిన వంగడాలను ఇవ్వడమే కాకుండా భారత్‌కు వచ్చేందుకు అంగీకరించారు. అలా మార్చి 1963లో నార్మన్‌ బోర్లాగ్‌ భారత్‌లో పర్యటించారు. అనంతరం ఆయన తయారుచేసిన 100 కిలోల పొట్టి గోధుమ వంగడాలు మెక్సికో నుంచి భారత్‌‌ చేరాయి. అదే ఏడాది నుంచి వీటిని భారత్‌లో ప్రయోగాత్మకంగా సాగుచేయడం ప్రారంభించారు.


ఆ పరిశోధన ప్రయత్నాలు ఫలించి దిగుబడి హెక్టారుకు 800 కిలోల నుంచి నాలుగున్నర టన్నులకు పెరిగి.. హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. 1960కి ముందు హెక్టారుకు 2 టన్నులున్న వరి దిగుబడి రెట్టింపయ్యింది. భారత హరిత విప్లవ పితామహుడిగా స్వామినాథన్‌ పేరు మారుమోగింది. బోర్లాగ్‌ సైతం స్వామినాథన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘మెక్సికో కోసం తయారు చేసిన ఈ వంగడాల విలువను స్వామినాథన్ గుర్తించకుంటే, వాటి కోసం ఆయన తపించకుంటే ఆసియాలో హరిత విప్లవమే వచ్చి ఉండేది కాదు.. ఈ ఘనత స్వామినాథన్‌కే దక్కుతుంది’ అని బోర్లాగ్‌ ప్రశంసించారు. తర్వాత స్వామినాథన్‌ సారథ్యంలో భారతీయ శాస్త్రవేత్తలు మరిన్ని మేలైన వంగడాలను సృష్టించారు. బోర్లాగ్ తయారుచేసిన ఎరుపు రంగులో ఉండగా... భారతీయ శాస్త్రవేత్తలు స్థానిక రకాలతో క్రాస్ బ్రీడ్ చేసి బంగారు రంగులోకి మార్చారు. నేడు భారతదేశంలో పండించే గోధుమల్లో మెక్సికో నుంచి వచ్చిన అసలు వాటి మూలాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com