ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయిలు, డ్రగ్స్, బిట్ కాయిన్ తయారీ మిషన్లు.. ఇది జైలా? నైట్ క్లబ్బా,,జైలు స్వాధీనం చేసుకోడానికి పోలీసులు భారీ ఆపరేషన్

international |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 08:42 PM

జైలు జీవితం అంటే ఇరుకు గదులు, నల్లులు, అపరిశుభ్రంగా ఉండే టాయ్‌లెట్‌లు గుర్తుకొస్తాయి. జైలు సిబ్బంది చెప్పినట్టు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మనం చెప్పుకోబోయే జైల్లో పరిస్థితులు అందుకు విరుద్దం. ఓ ముఠా జైలునే తన సామ్రాజ్యంగా మార్చుకుని.. పెళ్లాం, పిల్లలతో అక్కడే రాజభోగాలు అనుభవిస్తోంది. జైలు గదిని ఆటస్థలంగా, నైట్ క్లబ్‌గా, జూగా మార్చేశారు. ఈ ముఠా నుంచి జైలును స్వాధీనం చేసుకోడానికి ఏఖంగా 11 వేల మంది పోలీసులు, యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే ఆ ముఠా ఎంత బలంగా వేళ్లూనుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.


వెనిజులాలోని టోకోరన్ జైలు నుంచి పెద్ద ఎత్తున బిట్‌కాయిన్ మైనింగ్ మెషీన్లు, రాకెట్ లాంచర్లు బయటపడడం సంచలనంగా మారింది. జైలునే ఆటస్థలంగా, నైట్ క్లబ్‌గా, జూగా ముఠా మార్చేసిన వైనం భద్రత బలగాలను విస్మయానికి గురిచేసింది. 11 వేల మంది పోలీసులు, సైనికులు ట్యాంకులు, సాయుధ వాహనాలతో టోకోరన్ జైలుపై గురువారం దాడిచేసి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఓ సైనికుడు మృతి చెందాడు. ఏడాదికిపైగా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు అంతర్గత, న్యాయశాఖ మంత్రి రెమిగియో సెబాలస్ తెలిపారు.


కరుడగట్టిన ట్రెన్ డి అరగువా క్రిమినల్ ముఠా నుంచి స్నిపర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు, గ్రేనేడ్లతోపాటు కొకైన్, గంజాయి, ఖరీదైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతేకాదు, ఖైదీలతో కలిసి ఉంటున్న వారి భార్యలు, ప్రియురాళ్లను బయటకు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. జైలులో ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నవాటిని మీడియాకు ప్రదర్శించారు. బకెట్ల కొద్దీ బులెట్లు, మెషీన్ గన్ బులెట్ బెల్టులు, క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్లు తయారుచేసే మిషన్లు వంటివి ఇందులో ఉన్నాయి.


అలాగే, టీవీలు, మైక్రోవేవ్‌లు, ఏసీలు, ఫ్రిజ్‌లు కూడా ఉండగా.. వాటిని చూసిన మహిళలు అవన్నీ తమవేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాదు, జైలును మినీ జూలా మార్చేశారని, ఖైదీలు నిప్పు అంటించడంతో కొన్ని జంతువులు చనిపోయినట్టు మంత్రి చెప్పారు. ఖైదీలకు సహకరించిన నలుగురు జైలు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. జైలులో హోటల్ మాదిరి స్మిమ్మింగ్ పూల్, నైట్ క్లబ్, మినీ జూన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.


టోకోరోన్ జైలులో దోషులుగా నిర్ధారణ అయిన నేరస్థులు మాత్రమే కాకుండా వారి భాగస్వాములు, బంధువులలో కొంతమంది కూడా ఉన్నారు. గ్లాడిస్ హెర్నాండెజ్ అనే ఓ మహిళ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తన భర్తతో మాట్లాడతుండగా బయటకు తరమివేశారని తెలిపింది. వెనిజులాలో అత్యంత శక్తివంతమైన ట్రాన్స్‌నేషనల్ గ్యాంగ్ ట్రెన్ డి అరగువా ప్రధాన కార్యాలయంగా జైలు మారిపోయింది.


జైలు నుంచి ఈ ముఠా చీలీ వరకూ అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో విస్తరించి, సామ్రాజ్యాన్ని స్థాపించింది. మానవ అక్రమ రవాణ, వ్యభిచారం కార్యకలాపాలను నిర్వహించే ఈ ముఠా.. వలసదారులపై దోపిడీలకు పాల్పడతారు. ముఠా జైలులో ఆటల గదులు, ఫ్లెమింగోలు, ఉష్ట్రపక్షితో కూడిన చిన్న జూ వంటి అన్ని రకాల సౌకర్యాల ఏర్పాటుచేసున్నారు. గుర్రపు రేసులపై పందెం, తాత్కాలిక బ్యాంకులో రుణాలు, ‘టోకియో’ పేరుతో నైట్‌క్లబ్‌ నడుపుతోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com