ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీటు విషయంలో మహిళా పోలీస్‌తో రైల్లో గొడవ,,,.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో దుండగుడు హతం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 08:28 PM

రైలులో ప్రయాణిస్తోన్న మహిళా కానిస్టేబుల్‌పై దాడిచేసిన నిందితుడ్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు నిందితులు గాయపడగా.. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయోధ్యలో శుక్రవారం ఉదయం లక్నో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడిచేసిన నిందితుడు అనీశ్ హతమైనట్టు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్‌గా గుర్తించినట్టు తెలిపారు. ఆగస్టు 30న మహిళా కానిస్టేబుల్‌పై జరిగిన దాడిలో వీరిద్దరికీ ప్రమేయం ఉందని పేర్కొన్నారు.


ఈ ఎన్‌కౌంటర్‌లో కలండర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ రతన్‌శర్మ కూడా గాయపడ్డారని చెప్పారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లో సరయు ఎక్స్‌ప్రెస్ కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను పోలీసులు గుర్తించారు. నిందితులు పదునైన ఆయుధంతో ఆమెపై దాడిచేసి గాయపరిచారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం మహిళా పోలీస్‌ను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.


సీటు విషయంలో దుండగులు, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య రైలులో వాగ్వాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. చినికి చినికి గాలివానలా గొడవకు దారితీయడంతో కానిస్టేబుల్‌పై నిందితులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. రైలు అయోధ్యకు చేరుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి, వారి ఫోటోలను బాధితురాలికి చూపించగా ఆమె గుర్తుపట్టింది. నిందితులు అనీశ్ ఖాన్, అతడి సన్నిహితులు అజాద్, విశ్వంభర్ దయాళ్‌ల కోసం పోలీసులు గాలించారు. వారి నివాసంల్లో సోదాలు నిర్వహించగా.. శుక్రవారం ఉదయం తారసపడ్డారు. లొంగిపోవాలని పోలీసులు చేసిన సూచనలు బేఖాతరు చేస్తూ వారిపై నిందితులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసుల ఎదురుకాల్పులు జరపడం వల్ల అనీశ్ ఘటనా స్థలిలోనే హతమయ్యాడు. మరో ఇద్దరు నిందితులు అజాద్, విశ్వంభర్‌లు తీవ్రంగా గాయపడ్డారని అయోధ్య సీనియర్ ఎస్పీ రాజ్ కరన్ నాయర్ తెలిపారు. మరోవైపు, మహిళా కానిస్టేబుల్‌పై దాడి ఘటనను అలహాబాద్ హైకోర్టు సీరియస్‌గా పరిగణించి.. అర్ధరాత్రే విచారణకు స్వీకరించింది. రైల్వే పోలీసులు, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నిందితులను తక్షణమే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని.. ఘటనపై నివేదికను అందజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com