ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఔను తెలంగాణకు ముప్పుఉంది...అందుకే ఆ రెండు గ్రామాలు మాకు ఇచ్చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 09:06 PM

పోలవరం  ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ముప్పు ముంచివుందని ఏపీ సర్కార్ అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టు ముంపును కారణంగా చూపుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు రెవెన్యూ గ్రామంలోని 350 ఎకరాలు, నాగినేని ప్రోలు గ్రామంలో 240 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఈ గ్రామాలను తమకిచ్చేయాలని కోరింది. రెండు గ్రామాలను అడుగుతుండటంతో బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణలో ముంపు ఉండబోతన్నట్లు ఏపీ ప్రభుత్వం అంగీకరించనిట్లయింది.


ఏపీ సర్కారు నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో భారీగా ముంపు ముప్పు ఉందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయటంతో పాటు ముంపు నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసులు కూడా వేసింది. తెలంగాణ సర్కారు చెప్పిన విధంగా ముంపు పచ్చి అబద్ధమని ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చిన ఏపీ సర్కారు.. తాజాగా రెండు గ్రామాలను అడుగుతుండటంతో ముంపు ముప్పు వాస్తవమేనని అంగీకరించినట్లయింది.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత బ్యాక్ వాటర్ లోమునుగుతాయనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఏడు మండలాలను, 136 గ్రామాలను, 211 గూడెంలను తెలంగాణ రాష్ట్ర అవతరణ కంటే ముందే తెలంగాణ నుంచి విడదీసి ఏపీలో కలిపింది. ఏపీ తాజా ప్రతిపాదనలతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. తాము మెుదటి నుంచి చెబుతున్నట్లుగానే ముంపు ముప్పు ఉందని.. అందుకు ఏపీ సర్కారు పెట్టిన తాజా ప్రతిపాదనే ఉదహరణ అని చెబుతోంది. ఈ నేపథ్యంలో ముంపు ముప్పు పేరిట ఏపీ తీసుకున్న ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ కోరుతోంది.


పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఇవాళ దిల్లీలో కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మరోమారు రాష్ట్రంలో ముంపు ప్రభావంపై గట్టి వాదనలను వినిపించేందుకు తెలంగాణ సిద్ధమైంది. బూర్గంపాడు, నాగినేనిప్రోలు గ్రామాలను ఏపీలో కలపాలనే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల దాకా నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 891 ఎకరాల సాగుభూమి నీట మునగనుందని.., అలాగే పినపాక, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని 35 ఉప నదుల ప్రవాహానికి ఇబ్బందులు వస్తాయని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి నుంచి ఆ నదుల ప్రవాహం వెనక్కితన్నే అవకాశం ఉందని... అదే జరిగితే 40 వేల ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని చెబుతోంది.


పోలవరం ఎగువన భూపాలపట్నం, ఇచ్చంపల్లి బ్యారేజీలు కడతారని, వరదతో పాటు వచ్చే సిల్డ్ పోలవరం వరకు రాదని బచావత్ ట్రైబ్యునల్లో పేర్కొన్నా.. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత భూపాలపట్నం, ఇచ్చంపల్లి బ్యారేజీలు కట్టడం లేదన్నారు. అంటే ఎగువన వచ్చే మట్టి, ఇసుక, కంకర అంతా పోలవరంలో పూడికగా మారి ఇసుక దిబ్బలు పెరిగితే తెలంగాణలో మునక పెరుగుతుందని తెలంగాణ అభ్యతంరాలు వ్యక్తం చేస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం పోలవరం స్పిల్‌వే నిర్మాణంలో మార్పులు చేయాలని కోరుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com